కొంపముంచిన వేతన స్కేల్!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:07 AM
యూజీసీ వేతన స్కేల్ లేకపోవడంతో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు వందలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. రాష్ట్రవాప్తంగా పలు యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చేపట్టిన..
అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల్లో కొలమానంగా మారిన వేతన స్కేల్
అమలు చేయని ప్రైవేటు వర్సిటీలు
ఫలితంగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లకే చాన్స్
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): యూజీసీ వేతన స్కేల్ లేకపోవడంతో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు వందలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. రాష్ట్రవాప్తంగా పలు యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియలో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వందల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన అర్హుల జాబితాలను యూనివర్సిటీలు తాజాగా విడుదల చేశాయి. వీటిలో చాలా పోస్టుల్లో ఒక్కరూ అర్హత సాధించలేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎనిమిదేళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు పదేళ్లు.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా యూజీసీ స్కేల్‌పై పనిచేసి ఉండాలి. కానీ, రాష్ట్రంలో ఏ ప్రైవేటు విద్యా సంస్థ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ స్కేళ్లు అమలు చేయడంలేదు. కొన్ని విద్యాసంస్థలు యూజీసీ స్కేల్ ఇచ్చినట్లు కాగితాలపై చూపిస్తున్నా ఆ స్థాయి జీతం జమ చేయట్లేదు. దీంతో చాలా మంది అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించలేకపోయారు. చివరికి ఆ స్కేళ్లు అమలవుతున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్లే అర్హులుగా మారారు. స్కేల్‌తో పాటు ఇతరత్రా కారణాలతోనూ కొందరు అర్హత కోల్పోయారు. కానీ, ఎక్కువ మంది స్కేలు కారణంగానే నష్టపోయామని చెబుతున్నారు. మొత్తం గా ఉద్యోగం ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు డిగ్రీ లెక్చరర్లు.. అసోసియేట్, ప్రొఫెసర్ ఉద్యోగాలకు వెళ్లిపోతే ఆ లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది.
వర్సిటీల వారీగా
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జువాలజీ, ఆక్వాకల్చర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 14 మంది దరఖాస్తు చేసుకుంటే అందరూ అనర్హులయ్యారు. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇదే యూనివర్సిటీలో తెలుగు, సంస్కృతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 48 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరు మాత్రమే అర్హులుగా తేలారు.
ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 126 మంది దరఖాస్తు చేసుకుంటే 123 మందిని అనర్హులుగా మారారు. అప్లైడ్ మ్యాథమాటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 123 మంది దరఖాస్తు చేసుకుంటే 111 మంది అనర్హులయ్యారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో ఏడుగురు దరఖాస్తు చేసుకోగా ఒక్కరూ అర్హత సాధించలేకపోయారు. సీఎ్‌సఈ అసోసియేట్ ప్రొఫెసర్‌కు 42 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం అనర్హులయ్యారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు 19 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరే అర్హులయ్యారు.
జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కెమికల్, సివిల్, సీఎ్‌సఈ, ఈఈఈ, ఈసీఈ, గణితం, మెకానికల్ పోస్టులకు వందల మంది దరఖాస్తు చేసుకున్నా ఒక్కరు కూడా అర్హులు సాధించలేదు.
జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు.. ఈఈఈలో 157 మంది దరఖాస్తు చేసుకోగా ఇద్దరు మాత్రమే అర్హులుగా మిగిలారు. ఫిజిక్స్ పోస్టులకు 166 మంది దరఖాస్తు చేసుకుంటే ముగ్గురు అర్హులయ్యారు. ఎంబీఏ విభాగంలో 41 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కరూ అర్హత సాధించలేదు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 202 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరు మాత్రమే అర్హులయ్యారు. ఇంగ్లి్‌షలో 12 మంది దరఖాస్తు చేసుకుంటే అందరూ అనర్హులయ్యారు.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సీఎ్‌సఈ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 97 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరే అర్హత సాధించారు. ఫిజిక్స్‌లో 62 మందికి మొత్తం అనర్హులయ్యారు. బయోటెక్నాలజీలో 49 మందిలో నలుగురు అర్హత దక్కించుకున్నారు.
ఎస్వీయూలో సీఎస్ఈ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 243 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరు అర్హులయ్యారు. ఈఈఈలో 12 మంది దరఖాస్తు చేసుకుంటే అందరూ అనర్హులయ్యారు. మేనేజ్‌మెంట్ పోస్టులకు 145 మంది దరఖాస్తు చేసుకుంటే ముగ్గురే అర్హత సాధించారు.
యోగి వేమన వర్సిటీలో ఈఈఈ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 28 మంది దరఖాస్తు చేసుకుంటే అందరూ అనర్హులయ్యారు. మేనేజ్‌మెంట్ పోస్టులకు 148 మందిలో ఆరుగురు అర్హులయ్యారు. మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీలో 55 మందిలో ఒక్కరే అర్హత సాధించారు.