యూజీసీ నిధుల దుర్వినియోగం
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:00 AM
యూజీసీ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావుకు ఉన్నత విద్యాశాఖ భారీ జరిమానా విధించింది.
రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు భారీ జరిమానా
శాశ్వతంగా పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేత
10.19 లక్షల వడ్డీ రికవరీకి చర్యలు
ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): యూజీసీ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావుకు ఉన్నత విద్యాశాఖ భారీ జరిమానా విధించింది. పెన్షన్, గ్రాట్యుటీని శాశ్వతంగా నిలిపివేయడంతో పాటు ఆయన నుంచి రూ.10.19 లక్షల వడ్డీని కూడా వసూలు చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై ఇంత భారీగా జరిమానా విధించడం చాలా అరుదని చెబుతున్నారు. డి.వెంకటేశ్వరరావు 2009 డిసెంబరు నుంచి 2010 నవంబరు వరకు ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అప్పుడు రూ.26.77 లక్షల మేర యూజీసీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తనపై నమోదైన అభియోగాలపై వెంకటేశ్వరరావు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో కళాశాల విద్యాశాఖ విచారణాధికారిని నియమించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని విచారణాధికారి తేల్చారు. వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి డిస్మిస్ చేయడం లాంటి భారీ జరిమానా విధించాలని కళాశాల విద్య కమిషనర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అప్పటికి ఇంకా చెల్లించాల్సిన రూ.16.80 లక్షల నగదును రికవరీ చేయాలని 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. ఈలోగా 2017 జూలైలో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ వరకు డిస్మిసల్ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం వివరణ కోరింది.
మరోవైపు పదవీ విరమణ సమయానికి వెంకటేశ్వరరావు నుంచి మొత్తం రూ.26.77 లక్షలు రికవరీ చేశారు. అయితే ఆ మొత్తంపై 2024 మార్చి వరకు 4.7 శాతం రేటుతో లెక్కించగా, రూ.10.19 లక్షల వడ్డీ అవుతుందని, దానిని రిటైర్డ్ ప్రిన్సిపాల్ నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నిధుల దుర్వినియోగం అంశంలో వడ్డీ ఎందుకు వసూలు చేయకూడదో చెప్పాలని ఆయనకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం.. భారీ జరిమానా విధించే ఈ అంశాన్ని ఏపీపీఎస్సీ ముందుంచింది. ఏపీపీఎస్సీ కూడా భారీ జరిమానాకు ప్రతిపాదించడంతో శాశ్వతంగా పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేయడంతో పాటు వడ్డీని రికవరీ చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.