నేడు టీజీవీ కళాక్షేత్రంలో ‘ఉగాది సంబరాలు’
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:45 PM
తెలుగు వారి తొలి పండుగ ఉగాది వేడుకలకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం సిద్ధమైంది.
- పురస్కారాలకు పదిమంది ఎంపిక
కర్నూలు కల్చరల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారి తొలి పండుగ ఉగాది వేడుకలకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 5:30 గంటలకు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘ఉగాది సంబరాలు’ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ, జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్, జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన పీరా ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభిస్తున్నారు. గౌరవ అతిథులుగా రవీంద్ర, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేఎనవీ రాజశేఖర్ హాజరవుతున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన పది మందికి ‘టీజీవీ కళాక్షేత్రం ఉగాది పురస్కారాలు’ అందజేస్తున్నామని కళాక్షేత్రం అధ్యక్షులు, కళారత్న పత్తి ఓబులయ్య తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణస్వామి బృందంచే నాదస్వర కచేరీ, సాయంత్రం 6 గంటలకు భానుస్వామిచే శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఎస్.కరీముల్లా, చిత్రరేఖ, దేవీశ్రీ శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు.
ఫ ఉగాది పురస్కార గ్రహీతలు వీరే...
టీజీవీ కళాక్షేత్రం ఏటా ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది పురస్కారాలను అందజేస్తోంది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పది మందికి ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. వారిలో పి.భాస్కర్ (నాటక రంగం), బండారు బలరాముడు (హార్మోనిస్టు గురువు), చల్లా నవీనకుమార్ చౌదరి (జర్నలిజం), బి.చిన్నరాముడు (తెలుగు భాష ప్రచారం), బెస్త మల్లీశ్వరి (శాస్త్రీయ సంగీతం), మారుతి పౌరోహితం (సాహిత్యం), ఎస్.మహమ్మద్ మియా (గజల్ గాయకుడు), ఎస్‌ఎండీ ఇనయతుల్లా (కథా రచయిత), జాఫర్ బాషా (గాయకుడు), డాక్టర్ టి.మాలకొండయ్య (వైద్యరంగం)లో ఎంపిక చేసి పురస్కారాలు అందిస్తున్నారు. అలాగే ఇటీవల మిర్యాలగూడలో జాతీయ స్థాయి పద్యనాటక పోటీల్లో ఉత్తమ ద్వితీయ బహుమతి అందుకున్న ‘సై సైరా నరసింహారెడ్డి’ నాటకంలోని కళాకారులను సత్కరిస్తున్నట్లు పత్తి ఓబులయ్య తెలిపారు. టీజీవీ కళాక్షేత్రంలో ఈసీ సభ్యులుగా కొనసాగుతున్న వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రశంసాపత్రాలతో సత్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకలకు నగరప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.