Share News

ఉద్దానం ప్రజలకు భరోసా

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:11 AM

శ్రీకాకుంళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాల నుంచి కల్లోలం సృష్టిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాన్నిస్తున్నాయి.

ఉద్దానం ప్రజలకు భరోసా

  • నేడు పలాస కిడ్నీ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స

  • కిడ్నీ సమస్యల పరిష్కారంలో చరిత్రాత్మక ముందడుగు

  • కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి

పలాస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుంళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాల నుంచి కల్లోలం సృష్టిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాన్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలోని 200 పడకల ఆస్పత్రిలో శుక్రవారం మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహణకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఇక్కడ తొలిసారిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ చేయనున్నారు. అయితే.. ఇది ఒక ఆపరేషన్‌ కాదని, ఉద్దానం ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న భరోసా.. అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆపరేషన్‌ ఏర్పాట్లును గురువారం ఆమె స్వయంగా పరిశీలించారు. వైద్య అధికారులతో మాట్లాడారు.

విశాఖ, శ్రీకాకుళం నుంచి వైద్య నిపుణుల రాక

పలాస కిడ్నీ ఆస్పత్రిలో ఇప్పటికే వేలాది మందికి నిత్యం డ యాలసిస్‌ అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. డయాలసిస్‌ ఇస్తూనే మరోవైపు కిడ్నీ వ్యాధికి గల కారణాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇక్కడ డయాలసి్‌సతోపాటు అవసరమైతే కిడ్నీ మార్పిడి చికిత్స చేసేలా సిద్ధం కావాలని సీఎం పిలుపునివ్వడంతో వైద్యాధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్‌ఆర్‌ఐలు, ఐవోసీఎల్‌ అధికారులతో మాట్లాడి ఉచితంగా డయాలసిస్‌ యంత్రాలను అందించేలా చేశారు. ప్రస్తుతం ఉద్దానం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హేమశ్రీ అనే మహిళకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాల్సి రావడంతో ఆమె ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తండ్రి మోహనరావు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆపరేషన్‌కు మార్గం సుగమమైంది.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు పలాస కిడ్నీ ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ ఆస్పత్రికి పరిశోధనల కోసమే రూ.12 కోట్లు అందించిందని, ఇందులో అత్యవసర పరికరాల కోసం రూ.9 కోట్లు, రూ.3 కోట్లు రిసెర్చ్‌ గ్రాంటుగా కేటాయించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ మంత్రిగా పనిచేసిన వైద్యుడు ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు అప్పటి సీఎం జగన్‌తో హడావిడిగా ఆస్పత్రిని ప్రారంభించారని గుర్తు చేశారు. డయాలసిస్‌ కోసం సీహెచ్‌సీల్లో ఉన్న యూనిట్లను తీసుకొచ్చి కొత్తవి ప్రారంభించినట్టు కలరింగ్‌ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆస్పత్రి స్వరూపం మారిందని, నిధుల కేటాయింపుతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించామని తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 04:13 AM