ఉద్దానంలో ‘బయో మార్కర్’ పరీక్షలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:32 AM
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలకు ‘బయో మార్కర్’ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
కిడ్నీ వ్యాధి మూలాల కోసం మొదలైన అన్వేషణ
1500 మంది రక్త, మూత్ర నమూనాలు సేకరణ
బయో మార్కర్ పరీక్షలతో ప్రాథమిక దశలోనే గుర్తింపు
పరిశోధనలపై మంత్రి సత్యకుమార్‌కు అందిన నివేదిక
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలకు ‘బయో మార్కర్’ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా కిడ్నీ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఉద్దాన ప్రాంతంలో పరిస్థితులపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలకు సంబంధించి మెంటార్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ ప్రొఫెసర్ టి.రవిరాజు, ఆంధ్రా మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి.ప్రసాద్‌తో కూడిన పరిశోధన బృందం సభ్యులు నివేదికను మంత్రికి అందించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ... పరిశోధనల్లో వేగం పెంచాలని, ఉద్దాన బాధితుల్లో స్వాంతన చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఈ బృందానికి సూచించారు. దీనికోసం నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని తెలిపారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఉద్దాన ప్రాంతంలో స్థానికులను కలిసి ఇప్పటివరకూ సుమారు 1500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించిందని తెలిపారు. తొలుత వీటిని పలాసలోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌లో భద్రపరిచి, ఆ తర్వాత కేజీహెచ్‌లోని ల్యాబ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ఇక్కడ నిర్వహించే బయో మార్కర్ పరీక్షల ద్వారా కిడ్నీ బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుందని డాక్టర్ టి.రవిరాజు, డాక్టర్ జి.ప్రసాద్ వెల్లడించారు. ఈ ఫలితాల ఆధారంగా రోగులు జాగ్రత్తగా వ్యవహరించేందుకు, వారికి చికిత్స అందించేందుకు సులువుతుందని చెప్పారు. నిర్ణీత కాల వ్యవధిలోనే పరిశోధనలు పూర్తి చేసేందుకు వీలుగా నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని మంత్రికి వివరించారు.