Share News

రాష్ట్రానికి యూఏఈ ఫుడ్‌ క్లస్టర్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) ఫుడ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు..

రాష్ట్రానికి యూఏఈ ఫుడ్‌ క్లస్టర్‌

  • తొలి పెట్టుబడిగా చిత్తూరులో యూనిట్‌

  • 100 కోట్లతో సిద్ధమైన ‘ఫ్లోర్‌ మాస్టర్స్‌’

  • సీఎంతో యూఏఈ మంత్రి అబ్దుల్లా చర్చలు

  • కుదిరిన కీలక అవగాహన ఒప్పందం

  • మామిడి,అరటి,కోకోకు విలువ జోడింపు

  • దావోస్‌ సదస్సులో కుదిరిన డీల్‌ సాకారం

అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) ఫుడ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం విషయంలో సహకారం అందించేందుకు యూఏఈ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంటల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు చేసేలా వ్యాల్యూ యాడెడ్‌ చైన్‌ (విలువ జోడింపు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థల ద్వారా ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ దేశ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం చంద్రబాబు, అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీల సమక్షంలో ఏపీ ప్రభుత్వం-యూఏఈల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఖరారు చేస్తూ ‘ఏపీఈడీబీ’ అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ. 100 కోట్ల తొలి పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన ఫ్లోర్‌ మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ యూనిట్‌లో ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌, యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లోర్‌ మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌ దాదాపు 25 దేశాలకు తన ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది.


  • ఏపీలో అద్భుత అవకాశాలు

  • యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ వెల్లడి

కృష్ణా-గోదావరి లాంటి నదులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని విజనరీ నేత చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీ వ్యాఖ్యానించారు. భారత్‌-యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని చెప్పారు. ఏపీలో ఫుడ్‌ పార్క్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కోల్డ్‌చైన్‌ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమలను ప్రోత్సహిస్తుండటం ప్రశంసనీయమన్నారు. అమరావతి నుంచి న్యూయార్క్‌ మార్కెట్‌ వరకు డెయిరీ, పౌలీ్ట్ర, సీఫుడ్‌, పప్పుదినుసులు తదితర ఎగుమతులపై దృష్టి పెడతామని చెప్పారు.


  • క్వాంటం స్పీడ్‌తో అవకాశాలు అందుకోండి

  • యూఏఈ బృందానికి చంద్రబాబు ఆహ్వానం

క్వాంటం స్పీడ్‌తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు యూఏఈ బృందాన్ని కోరారు. పర్యావరణ అనుకూల అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్‌ సదస్సులో ఆసక్తి కనబరిచిన యూఏఈ ఆరు నెలల్లోపే సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఉద్యాన, ఆక్వా రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం.. ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తోందని చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు కలిపి లక్ష కోట్ల పెట్టుబడులతో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని వివరించారు. రిలయన్స్‌ భాగస్వామ్యంతో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ను (ఐఎస్ఏ) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని చెప్పారు.

Updated Date - Jul 22 , 2026 | 05:05 AM