నంద్యాల జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:07 AM
నంద్యాల జిల్లా పులిమద్ది గ్రామ మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో బోగస్ హాజరుపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.
బోగస్ హాజరు నేపథ్యంలో విద్యా శాఖ చర్యలు
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పులిమద్ది గ్రామ మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో బోగస్ హాజరుపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ‘హాజరు ప్రభుత్వ బడిలో.. చదువు ప్రైవేటులో..’ అనే శీర్షికతో ఈ నెల 3న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టి రెగ్యులర్ ఉపాధ్యాయుడు కృష్ణారావు, డిప్యూటేషన్‌పై వచ్చిన విజయభాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్టు నంద్యాల డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3 వరకు సెలవు పెట్టారు. అదే గ్రామంలో ఉన్న మోడల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న విజయభాస్కర్‌రెడ్డిని నియమించారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి 2న 14 మంది విద్యార్థుల్లో హాజరైన నిహారిక అనే విద్యార్థినికి హాజరువేసి రికార్డులో ఉన్న 13 మంది విద్యార్థులకు గైర్హాజరు వేశారు. సెలవులో ఉన్న కృష్ణారావు హాజరు శాతాన్ని విచారించకుండానే మిడ్ డే మీల్స్ యాప్‌లో 14 మంది హాజరైనట్టు నమోదు చేశారు.