కాటేసిన కరెంట్ తీగ!
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:40 AM
ముక్కు పచ్చలారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు! సెలవు రోజున ఆడుకొనేందుకు స్నేహితుల ఇంటికి వెళ్లారు. ఆడుకుంటూ ఆడుకుంటూ.. మిద్దె మీదకు వెళ్లగా, అక్కడ అప్పటికే నీటిలో పడి ఉన్న విద్యుత్తు తీగ మృత్యువు రూపంలో వారిద్దరి మింగేశాయి.
విద్యుదాఘాతానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బలి
ఆడుకునేందుకు స్నేహితుల ఇంటికెళ్లిన చిన్నారులు
అప్పటికే మిద్దెపై నీటిలో పడి ఉన్న విద్యుత్తు వైర్
ఆ నీటిలోకి వెళ్లడంతో
మృత్యువాత.. నెల్లూరులో ఘటన
నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ముక్కు పచ్చలారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు! సెలవు రోజున ఆడుకొనేందుకు స్నేహితుల ఇంటికి వెళ్లారు. ఆడుకుంటూ ఆడుకుంటూ.. మిద్దె మీదకు వెళ్లగా, అక్కడ అప్పటికే నీటిలో పడి ఉన్న విద్యుత్తు తీగ మృత్యువు రూపంలో వారిద్దరి మింగేశాయి. విద్యుదాఘాతానికి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బలయ్యారు!! ఈ విషాద ఘటన నెల్లూరు నగరంలోని హరనాధపురంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలాజీనగర్ పోలీసుల కథనం మేరకు.. మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం విబైలు గ్రామానికి చెందిన గురవయ్య ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల క్రితం నెల్లూరు వచ్చి హరనాధపురం 2వ వీధిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురవయ్య సిమెంట్ బస్తాలు మోసే కూలి పనికి వెళ్తుండగా, భార్య సుజాత ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తెలు జ్యోతి (11), అమూల్య (7) సంతానం. జ్యోతి 6వ, అమూల్య 2వ తరగతి చదువుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లడం, ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వారిద్దరూ బంధువుల పిల్లలతో ఆడుకోవడానికి వారి ఇంటికి వెళ్లారు.
విద్యుత్తు తీగ రూపంలో మృత్యువు
బంధువుల ఇంటికి వెళ్లిన జ్యోతి, అమూల్య స్నేహితులతో కలిసి ఆడుకుంటూ మిద్దెపైకి వెళ్లారు. అక్కడ మిద్దెపై వెలిగే లైటు వైరు కిందపడి ఉండగా, దాని నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. అదే సమయంలో మిద్దెపై వాటర్ ట్యాంకు నిండి నీరు మిద్దె ఫ్లోర్‌పైకి చేరాయి. ఆ నీటిలోకి విద్యుత్ సరఫరా అవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో.. ఆ విషయం తెలియని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ నీటిలోకి వెళ్లారు. దీంతో కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో వారితో పాటు మిద్దెపైకి వెళ్లిన మరో చిన్నారి ఆ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు హడావుడిగా మిద్దెపైకి చేరుకొని.. నీటిలో ఉన్న కరెంట్ వైరును పక్కకు తీయించారు. అప్పటికే జ్యోతి మృతిచెందగా, అమూల్య కొనఊపిరితో ఉండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అమూల్య కూడా అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. తల్లిదండ్రులు వైద్యశాలకు వచ్చి, బిడ్డలిద్దరూ విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు.