వీఆర్‌లోకి ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:45 PM
పత్తికొండ కోర్టు మేజిస్ర్టేట్ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది.
పత్తికొండ కోర్టు ఘటనలో పోలీసుల తీరును తప్పు పట్టిన హైకోర్టు
ఆలూరు/ కర్నూలు జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ కోర్టు మేజిస్ర్టేట్ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. ఈ ఘటనలో పత్తికొండ, చిప్పగిరి ఎస్‌ఐలు ఆర్.విజయ్‌కుమార్, సతీ్‌షకుమార్‌తో పాటు కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీని వీఆర్‌లోకి పంపుతూ ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు.. చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన ఉనేబాదు శివయ్య గంజాయి సాగు చేస్తున్నాడనే ఆరోపణలతో చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ వేసిన శివయ్య లొంగిపోయేందుకు గత నెల డిసెంబర్ 24న పత్తికొండ కోర్టుకు వచ్చాడు. మఫ్టీలో ఉన్న చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు సతీ్‌షకుమార్, విజయ్‌కుమార్, షబ్బీర్, రామోజీ ఆయనను అరెస్టు చేశారు. కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడు శివయ్యను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పత్తికొండ న్యాయవాదుల సంఘం జనరల్ సెక్రటరీ జి.భాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపించారు. హోంశాఖ తరపున సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోర్టు హాలులోకి వెళ్లలేదన్నారు. సరెండర్ పిటిషన్ గురించి వారికి అవగాహన లేదన్నారు. కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని పత్తికొడ మేజిస్ర్టేట్ ఎస్పీని ఆదేశించారు. ఎస్పీ సంబంధిత పోలీసులకు చార్జ్‌మెమోలు ఇచ్చి వారి నుంచి వివరణ కోరారు. ఈనేపథ్యంలో విచారించిన హైకోర్టు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. క్రమశిక్షణ చర్యలో భాగంగా నలుగురిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌కు పంపడం కాదని, సస్పెన్షన్ చేయాలని న్యాయవాదులు పట్టుబడుతున్నారు.