జగన్ ‘బల ప్రదర్శన’కు మరో ఇద్దరు బలి.!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:03 AM
‘లేని జనం’ ఉన్నట్టు హడావుడి, భారీఎత్తున వాహనాలతో రోడ్ల దిగ్బంధనం, దారి క్లియర్‌గా ఉన్నా 5కిమీ కంటే తక్కువ వేగంతో కాన్వాయ్‌ల ప్రయాణం..
గుండెపోటుతో ఒకరు.. ప్రమాదానికి గురై మరొకరు మృతి
సాగదీత యాత్రలతో పోతున్న ప్రాణాలు
తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట
కానీ 7 గంటలు సాగిన జగన్ పర్యటన
‘గుంటూరు’ ఎత్తుగడే మళ్లీ అమలు
దారి క్లియర్‌గా ఉన్నప్పటికీ 5 కి.మీ. స్పీడ్
స్టంట్లు చేస్తున్న యువకులను ఆపని జగన్ అండ్ కో.. పైగా రెచ్చగొట్టేలా తీరు
గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త
ఆ తర్వాతా మారని ‘పరామర్శల’ తీరు
అమరావతి, విజయవాడ (ఇబ్రహీంపట్నం) ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘లేని జనం’ ఉన్నట్టు హడావుడి, భారీఎత్తున వాహనాలతో రోడ్ల దిగ్బంధనం, దారి క్లియర్‌గా ఉన్నా 5కిమీ కంటే తక్కువ వేగంతో కాన్వాయ్‌ల ప్రయాణం.. వెరసి పరామర్శ పేరిట సాగిన మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంత్రి లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబు విసిరిన నేపథ్యంలో ఆయన పరామర్శకు జగన్ బయలుదేరారు. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం గంట దూరంలోనే ఉంది. కానీ దండయాత్రను తలపించేలా జగన్ అండ్ కో 7గంటలకుపైగా ఈ మార్గంలో పర్యటించారు. తనకు లేని జనబలాన్ని.. ఉన్నట్టు చూపించుకుంటూ కలరింగ్ ఇవ్వడానికి గుంటూరు పర్యటనలో ఉపయోగించిన ట్రిక్‌నే ఇక్కడా ప్రయోగించారు. తన ‘దీర్ఘ’యాత్రలతో కార్యకర్తలను, జనాలను యాతన పెట్టారు. వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జోగి ఇంటికి జగన్ 10.30 గంటలకు చేరుకోవాలి. గంట ఆలస్యమైనా 11.30కు చేరుకుంటారు. జగన్ ఇంటి నుంచి 11.06శాతం భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని భావించిన పోలీసులు, ఆయన కాన్వాయ్ వేగంగా ముందుకు కదిలేందుకు వీలుగా పశ్చిమ బైపా్‌సను కేటాయించారు. ఖాళీగా ఉండే ఈ దారిలో ప్రయాణానికి జగన్‌కు 4 గంటలకు పైగా పట్టడం గమనార్హం. ఆయన జోగి రమేశ్ ఇంటికి సాయంత్రం 5.06కు చేరుకున్నారు.
సోలుతున్న ప్రాణాలు..
జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లుకు చెందిన దొంగల రాంబాబు (41) జగన్‌ను చూసేందుకు 11 గంటలకు ఇబ్రహీంపట్నం వచ్చారు. జోగి ఇంటికి కొద్దిదూరంలో రోడ్డుపై పడిపోయారు. పాత పంచాయతీ కార్యాలయంలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనకు వైద్య సేవలందించి 108 అంబులెన్స్‌లో గొల్లపూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీంపట్నం కొత్తగేటుకు చెందిన బండారు భార్గవ్ (17) ద్విచక్రవాహనంపై జగన్‌ను చూసేందుకు వెళుతూ, అదుపు తప్పి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
అర గంట ‘పరామర్శ’
80 కార్లు.. వందల ద్విచక్ర వాహనాలతో బయలుదేరినప్పటి నుంచీ కారులో నుంచి బయటకు రావడం, దండాలు పెట్టడం! జోగి ఇంటి వరకు జగన్‌ది ఇదే తీరు. దీంతో హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆగిపోయింది. ఇంతా చేస్తే అరగంట మాత్రమే జోగి ఇంట్లో గడిపారు. సాయంత్రం 6.30కు తిరిగి తాడేపల్లి పయనమయ్యారు.
కారు చక్రాల కింద నలిగిన ప్రాణం
గత ఏడాది జూన్ 23న రెంటాళ్లకు జగన్ మందీ మార్బలంతో వెళ్లారు. ఈ పర్యటనలో వైసీపీ దళిత కార్యకర్త ఒకరు జగన్ కారు కింద పడి చనిపోయారు. అయినా ఆయన కారు దిగలేదు. దళితులపై వల్లమాలిన ప్రేమాభిమానాలు కురిపించే జగన్, ఆ కార్యకర్త కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. బాధితులే జగన్ ఇంటికి వచ్చారు. ఇలా జగన్ పర్యటనలో తరచూ నాయకులు, కార్యకర్తలు మృతి చెందుతున్నా, ఆయన యాత్రల తీరు మాత్రం మారడం లేదు. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడు ఎవరైనా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలి. యాత్ర సాగుతున్నప్పుడు కారు డోర్‌ను తీసేందుకుగానీ, డోర్ అద్దాలు కిందకు దించేందుకుగానీ వీల్లేదు. కానీ, జగన్ కారుడోర్ తీసి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నిలబడుతున్నారు. ఒకవైపు తన ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ జగన్ ‘సీఎం’ తరహా భధ్రతను కోరుతున్నారు. మరోవైపు పర్యటనల సమయంలో సొంత పార్టీ కార్యకర్తల భద్రతను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదు.