ఎవరో ఆ బిడ్డలు?!
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:58 AM
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో ఇద్దరు పసి పిల్లల విక్రయాలు జరిగిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ముదినేపల్లిలో ఇద్దరు చిన్నారుల విక్రయం
కొని పెంచుకుంటున్న పిల్లలు లేని దంపతులు
బాలల సంరక్షణ అధికారిణి ఫిర్యాదు.. కేసు నమోదు
ముదినేపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో ఇద్దరు పసి పిల్లల విక్రయాలు జరిగిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కైకలూరు కేంద్రంగా పిల్లల విక్రయాలు జరుగుతున్నట్టు ప్రచారంలోకి రావడంతో మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మూడు రోజులుగా నిర్వహించిన దర్యాప్తులో పిల్లలు లేని దంపతులు మధ్యవర్తుల ద్వారా ఏడాదిలోపు పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్నట్టు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన డి.ప్రసాద్, సునీత దంపతులు వివాహం జరిగి చాలా కాలమైనా పిల్లలు పుట్టకపోవడంతో ఐవీఎఫ్ పరీక్షలు చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఈడేపల్లికి చెందిన వీరకుమారి అనే మహిళ ద్వారా ఎనిమిది నెలల వయస్సు కలిగిన ఒక పాపను తెచ్చుకుని అందుకు ప్రతిఫలంగా రూ.మూడు లక్షలు ఇచ్చారు. ఆ పాపను తమ బిడ్డగా చూపించి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ను సృష్టించి ఆధార్ కార్డు తీసుకున్నారు. అయితే ఇటీవల గుట్టు రట్టయింది. దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీసు అధికారులు ఆరా తీయగా మరో ఘటన కూడా వెలుగు చూసింది. గతంలో ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన మాధురి అనే మహిళ ద్వారా ఏడాది లోపు వయస్సు ఉన్న మగ పిల్లవాడిని వీరకుమారి రూ.30 వేలకు కొనుగోలు చేసి ముదినేపల్లికి చెందిన గోపీ అనే వ్యక్తికి ఇచ్చింది. ఆ చిన్నారిని కూడా అధికారులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో ఆ పిల్లల అసలు తల్లిదండ్రుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఏలూరు జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.వీరకుమారి, మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ముదినేపల్లి ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో పోలీస్ బృందాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు శనివారం రంగంలోకి దిగాయి. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో సీఐ రవికుమార్, ఎస్‌ఐ వీరభద్రరావు ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఇటీవల శ్రీహరిపురం కాలనీలో అదృశ్యమైన ఆకేటి మోక్షిత్ అనే బాలుడు కూడా విక్రయానికి గురయ్యాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.