Share News

సాయికృష్ణ కేసులో ఇద్దరు లొంగుబాటు

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:42 AM

విజయవాడలో కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజ్ఞాతంలో ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు కె.అశోక్‌, జగం నాని సోమవారం సాయంత్రం విజయవాడలో..

సాయికృష్ణ కేసులో ఇద్దరు లొంగుబాటు

  • ఏసీపీ ఎదుట హెచ్‌సీలు అశోక్‌, నాని హాజరు

  • సిట్‌ కార్యాలయానికి అప్పగించిన ఏసీపీ

  • మూడు రోజులుగా ఇద్దరూ అజ్ఞాతంలో

  • కేసులో నిందితులుగా చేర్చిన సిట్‌

విజయవాడ, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): విజయవాడలో కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజ్ఞాతంలో ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు కె.అశోక్‌, జగం నాని సోమవారం సాయంత్రం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఆటోలో ఇద్దరూ కలిసి సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. మొదటి అంతస్తులో ఉన్న దక్షిణ మండలం ఏసీపీ మానస కార్యాలయానికి వెళ్లి ఆమె ఎదుట లొంగిపోయారు. పది నిమిషాల్లో ఆమె వాహనంలో ఇద్దరిని సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సిట్‌ అధికారులకు అప్పగించారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండడంతో న్యాయస్థానంలో లొంగిపోతారనే ప్రచారం జరిగింది. దీంతో సిట్‌ అధికారులు, పోలీసులు న్యాయస్థానాల ప్రాంగణం చుట్టూ నిఘా పెట్టారు. అయితే వారిద్దరూ ఏసీపీ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజు అరెస్టు తర్వాత తదుపరి వంతు ఎవరిదన్న దానిపై జోరుగా చర్చ సాగింది. నాగరాజుకు కుడి, ఎడమగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుళ్లు కె.అశోక్‌, జగం నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. మూడు రోజులుగా వారిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు. విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడంతో ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు.


మరో ముగ్గురిని నిందితులుగా చేర్చాం: సిట్‌ మోమో

సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చామని సిట్‌ కోర్టుకు తెలియజేసింది. దీనికి సంబంధించిన మోమోను సోమవారం దాఖలు చేశారు. కృష్ణలంక హెడ్‌కానిస్టేబుళ్లు కె.అశోక్‌, జంగం నానితో పాటు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సన్నిహితుడు సురేశ్‌ను నిందితులుగా చేర్చినట్టు మోమోలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారి ఎల్‌.సుధాకర్‌ కోర్టుకు హాజరయ్యారు. నేరుగా న్యాయాధికారి శ్రీకాంత్‌ చాంబర్‌కు వెళ్లి ఈ మోమోను దాఖలు చేసి వెళ్లిపోయారు. తర్వాత కోర్టు హాలులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సత్యవాణి ఈ విషయాన్ని వివరించారు. కేసులో ఇప్పటికే ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని, అతనికి సహకరించినట్టు అనుమానాలు ఉన్న ముగ్గురిని నిందితులుగా చేర్చామని తెలిపారు.

నాగరాజు కస్టడీపై నేడు విచారణ

ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును 12 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సిట్‌ పిటిషన్‌కు నాగరాజు తరఫు న్యాయవాదులు సోమవారం కౌంటర్‌ దాఖలు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుకు ఇంటి భోజనం

సాయికృష్ణ అదృశ్యం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజుకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతిస్తూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి శ్రీకాంత్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ మేరకు నాగరాజు తరఫు న్యాయవాది కొంపెళ్ల అరుణ్‌ వినతిని సమ్మతించారు.


సీసీ ఫుటేజీపై విచారణ 3కు వాయిదా

గాదె సాయికృష్ణ అదృశ్యంపై న్యాయవిచారణ జరిపించాలని, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో తొలగించిన సీసీ కెమెరాల ఫుటేజీని రిట్రీవ్‌ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను న్యాయస్థానం మూడో తేదీకి వాయిదా వేసింది. తొలగించిన సీసీ కెమెరాల ఫుటేజీని రిట్రీవ్‌ చేయాలని అతడి తల్లి విజయలక్ష్మి పిటిషన్‌ దాఖలు చేశారు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై 15కి విచారణ వాయిదా

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సాయికృష్ణ అదృశ్యం కేసులో తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ జూలై 15కి వాయిదా పడింది. సోమవారం హైకోర్టు సమయం ముగియడంతో విచారణ సాధ్యపడలేదు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ సుభేం దు శమంతలతో కూడిన బెంచ్‌ ప్రకటించింది.

Updated Date - Jun 30 , 2026 | 04:43 AM