Share News

మత్స్యకారులను మింగిన సముద్రం

ABN , Publish Date - May 28 , 2026 | 05:30 AM

సముద్రంలో పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు మరణించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ అలిచర్ల బంగారుపాలెంలో...

మత్స్యకారులను మింగిన సముద్రం

  • బలమైన గాలులకు పడవ బోల్తా పడి ఇద్దరు మృతి

  • నెల్లూరు జిల్లా అలిచర్ల బంగారుపాలెంలో విషాదం

  • 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

  • మరో ఘటనలో ఇద్దరు జాలర్ల గల్లంతు..

  • గాలింపు చేపట్టిన మెరైన్‌ పోలీసులు

బిట్రగుంట, మే 27(ఆంధ్రజ్యోతి): సముద్రంలో పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు మరణించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ అలిచర్ల బంగారుపాలెంలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. ఇదే గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు. వారికోసం మెరైన్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఫిషరీస్‌ ఏడీఈ ఎస్‌కే చాన్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. అలిచర్ల బంగారుపాలెంకు చెందిన తూపిలి బాలమురళి(48), కుమారి గోవిందు(47) మంగళవారం రాత్రి నాటుపడవలో సముద్రంలో వేటకు వెళ్లారు. బలమైన గాలులకు పడవ బోల్తా పడి ఇద్దరూ నీటమునిగారు. వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం మెరైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు తీరం వెంబడి గాలించగా పాతపాలెం పరిసరాల్లో ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలిచర్ల బంగారుపాలెం గ్రామానికే చెందిన అన్నదమ్ములు తులసింగారి రాజు, గణేష్‌ మంగళవారం రాత్రి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు మెరైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. మెరైన్‌ సిబ్బంది రెండు మోటారు బోట్లతో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు.

Updated Date - May 28 , 2026 | 05:30 AM