విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:52 AM
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం చింతగుంట పంచాయతీ కొత్తతురకపల్లె వద్ద పంట రక్షణకు రైతులు ఏర్పాటుచేసిన కరెంటు తీగలు తగిలి...
పంట రక్షణకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగలడంతో ప్రమాదం
ఎర్రావారిపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం చింతగుంట పంచాయతీ కొత్తతురకపల్లె వద్ద పంట రక్షణకు రైతులు ఏర్పాటుచేసిన కరెంటు తీగలు తగిలి ఆదివారం రాత్రి రెండు ఏనుగులు మృతిచెందాయి. ఇక్కడి ఫారెస్టు ఠాణాకు అతి సమీపంలో రైతులు సమీర్, అక్తర్ తమ మామిడితోటలో అంతరపంటగా వేరుశనగ, పాడి పశువులకు గడ్డి సాగు చేశారు. ఈ పొలాల్లోకి అడవి పందులు, దుప్పులు వచ్చి నష్టపరుస్తుండటంతో చుట్టూ కరెంటు తీగలు లాగారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పశువుల గడ్డి మేసిన ఆరేళ్ల మగ ఏనుగు.. వేరుశనగ సాగు చేసిన పొలంలోకి వచ్చింది. ఆ సమయంలో పొలం చుట్టూ ఉన్న విద్యుత్ తీగలకు తగిలి అక్కడే ప్రాణాలు వదిలింది. అక్కడికి సమీపంలోనే 14 సంవత్సరాల మరో ఏనుగు కూడా విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఏనుగుల మృతికి కారకులైన సమీర్, అక్తర్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుపతి డీఎఫ్‌వో సాయిబాబా తెలిపారు.