Share News

ధూళిపాళ్ల కుమార్తె వివాహానికి ఇద్దరు సీఎంలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:27 AM

టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కుమార్తె వివాహం బుధవారం గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌....

ధూళిపాళ్ల కుమార్తె వివాహానికి ఇద్దరు సీఎంలు

  • పాత మిత్రులతో రేవంత్‌ రెడ్డి ముచ్చట్లు

  • వేదికపై లోకేశ్‌తో కలిసి ఫొటోలు

  • కొత్త జంటకు పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు

గుంటూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కుమార్తె వివాహం బుధవారం గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్‌ రామ్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌ కలుసుకుంటారని అంతా భావించారు. కానీ, రేవంత్‌ రాక ఆలస్యం కావడంతో చంద్రబాబు ముందుగానే పెళ్లి వేడుకకు హాజరై దంపతులను ఆశీర్వదించి వెళ్లారు. కుటుంబ సమేతంగా రేవంత్‌ వచ్చిన సమయంలో లోకేశ్‌ అక్కడ ఉన్నారు. వీరిరువురూ వేదికపైనే కరచాలనం చేసుకుని, సరదాగా గడిపారు. ఇద్దరూ కలసి నవదంపతులతో ఫొటోలు దిగారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సవిత, కొల్లు రవీంద్ర, సీపీఐ సీనియర్‌ నేత కే.నారాయణ తదితరులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రేవంత్‌కు ఘన స్వాగతం

రేవంత్‌రెడ్డికి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. తొలుత పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్ద జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ రమణమూర్తి స్వాగతం పలికారు. పెళ్లి జరుగుతున్న శ్రీ కన్వెన్షన్‌ వద్ద తెలుగు తమ్ముళ్లు, ఆయన అభిమానులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. పలువురు పాత మిత్రులను రేవంత్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. పయ్యావుల, నన్నపనేని రాజకుమారి, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు.

మహిళా కోటా... బీ రెడీ!... నరేంద్ర కుమార్తెతో లోకేశ్‌

‘మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయ్‌... రెడీగా ఉండు’ అంటూ నవ వధువు వైదీప్తితో లోకేశ్‌ అన్నారు. దీనిపై ఆమె తండ్రి, ఎమ్మెల్యే నరేంద్ర వెంటనే స్పందిస్తూ... ‘నా సీటుకే ఎసరు పెడతారా బాబూ!’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 26 , 2026 | 03:27 AM