Share News

వేట్లపాలెం ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:22 AM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన కేసులో నిందితులు అడబాల అర్జున్‌(ఏ-1), అడబాల వీరబాబు(ఏ-2)లను పోలీసులు అరెస్టు చేశారు.

వేట్లపాలెం ఘటనలో  ఇద్దరు నిందితుల అరెస్టు

  • పోలీసుల అదుపులో అడబాల అర్జున్‌, వీరబాబు

  • అధిక మొత్తంలో పేలుడు పదార్థాల వినియోగం

  • నిందితుల ఆస్తుల జప్తునకు ప్రయత్నాలు

  • కాకినాడ ఎస్పీ బిందుమాధవ్‌ వెల్లడి

  • తాజాగా మరో ఇద్దరు క్షతగాత్రులు మృతి

  • మొత్తం 28కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ/సామర్లకోట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన కేసులో నిందితులు అడబాల అర్జున్‌(ఏ-1), అడబాల వీరబాబు(ఏ-2)లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మరణించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ గురువారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అడబాల అర్జున్‌, వీరబాబు(నాని) మధ్యాహ్నం 2 గంటల సమయంలో సామర్లకోట రైల్వే గూడ్స్‌ షెడ్‌ వద్ద రైలు ఎక్కడానికి వేచి ఉండగా పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం వేట్లపాలెంలో జరిగిన ఈ పేలుడు ప్రమాదంపై అదేరోజు సాయంత్రం తహశీల్దార్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారని, ఆ మేరకు సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ యాజమాని అడబాల అర్జున్‌, ఆయన సోదరుడు అడబాల వీరబాబు, వారి తండ్రి అడబాల శ్రీనివాసరావు (దుర్ఘటనలో మృతి చెందారు)పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు. అర్జున్‌ తన ఫైర్‌వర్క్స్‌కు 2022లో ఎల్‌ఈ-1 లైసెన్స్‌ పొందారని, తిరిగి 2024లో రెన్యువల్‌ చేయించినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. వీరబాబుకు బాణసంచా విక్రయానికి సంబంధించి ఎల్‌ఈ-5 లైసెన్స్‌ ఉందని.. వారిద్దరి తండ్రికి వేట్లపాలెంలో వివిధ తయారీ యూనిట్లలో పనిచేసిన అనుభవం ఉండడంతో అర్జున్‌ పేరిట లైసెన్స్‌ తీసుకుని ముగ్గురూ కలిసి కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ‘అర్జున్‌ లైసెన్స్‌ గడువు ఈ నెల 30న ముగియనుండడంతో ఈలోపు అధిక మొత్తంలో బాణసంచా తయారు చేసి వీరబాబు దుకాణంలో విక్రయించే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ జువ్వగుల్లలు, ప్లాస్టిక్‌ చిచ్చుబుడ్ల గుల్లల్లో మందుగుండు పదార్థాన్ని అధికంగా నింపే పని చేపట్టారు.


ఈ నెల 3న జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతరకు మందుగుండు సామగ్రి ఆర్డర్‌ రావడంతో.. అధిక సంఖ్యలో కార్మికులను నియమించారు. అనుభవం లేని వారు మందుగుండు పదార్థాలను గట్టిగా నింపడంతో పేలుడు జరిగింది. 20 మంది సంఘటన స్థలంలో, మరో 8 మంది కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. త్వరలోనే నిందితులపై చార్జిషీటు నమోదు చేసి శిక్షపడేలా చేస్తాం’ అని తెలిపారు. నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న 11 బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిపివేశామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే ప్రమాద కారణాలపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం డివిజన్‌ స్థాయి అధికారులను సస్పెండ్‌ చేసిందని, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. భారీ స్థాయిలో 300 కిలోల మందుగుండు సామగ్రి నిల్వ ఉంచారని తెలిపారు. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు 20 వరకు ఉన్నాయని, వీరు నిబంధనలు పాటించకపోయినా, అధికమొత్తంలో పేలుడు పదార్థాలు తీసుకొచ్చినా, శాస్త్రీయ పద్ధతిలో బాణసంచా తయారీ చేయకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


  • ఒళ్లంతా కాలినా..

  • నడుచుకుంటూ అంబులెన్స్‌ వద్దకు

వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రగాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్తపేటకు చెందిన సప్పా వెంకటలక్ష్మి (41), పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన మోర్త శ్రీను (30) గురువారం మృతిచెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. మరో ఇద్దరు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా.. వేట్లపాలెంలో ప్రమాదంలో ఆనా డు మంటల్లో చిక్కుకున్న మోర్త శ్రీను తన కళ్లముందే సహచరుల దేహా లు తునాతునకలు కావడం చూశాడు. తన ఒళ్లంతా కాలిపోయి చర్మం పొరలు పొరలుగా ఊడిపోయి.. ఒంటిపై దుస్తులు పీలికలైపోయినా ఏమాత్రం భయపడకుండా నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్‌ ఎక్కేశాడు. అయితే ఆ సమయంలో అంత నిబ్బరంగా ఉన్న శ్రీను.. మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. పెద్దాపురానికి చెందిన శ్రీను పూల డెకరేషన్‌ చేస్తుంటాడు. ఖాళీ సమయాల్లో బాణసంచా తయారీకి వెళ్తుంటాడు. ప్రమాదానికి 3 రోజుల ముందు అక్కడ పనికి వెళ్లాడు. శనివారం (28న) తాను రాలేనంటూ శుక్రవారం రాత్రి యజమానికి ఫోన్‌ చేసి చెప్పాడు. అయితే శనివారం కూడా వస్తేనే కూలిడబ్బులు ఇస్తానని యజమాని చెప్పడంతో అయిష్టంగానే వెళ్లి బలయ్యాడు.

Updated Date - Mar 06 , 2026 | 06:05 AM