జానూ.. ఎక్కడమ్మా!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:20 AM
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ రెండేళ్ల కూతురి కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లుపెట్టని క్షణమంటూ లేదు. అమ్మా.. నాన్నా అనే పిలుపుకోసం ఎదురుచూడని గడియ లేదు..
తునిలో 4 రోజులుగా కనిపించని రెండేళ్ల చిన్నారి
400 మంది పోలీసులు, ఊరిజనం జల్లెడ
డ్రోన్లు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు
కొండలు, గుట్టలు వెతికినా ఆచూకీ కరువు
ఆడుతూ ఇంటి నుంచి బయటికి చిన్నారి
వెంట వెళ్లిన పెంపుడు కుక్క.. 3 రోజుల తర్వాత ఇంటికి
పాపను ఎవరైనా అపహరించారా?
జంతువులు ఈడ్చుకెళ్లాయా?
అన్ని కోణాల్లో దర్యాప్తు.. డాగ్‌స్క్వాడ్‌కు భారీ వర్షాలతో తిప్పలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ రెండేళ్ల కూతురి కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లుపెట్టని క్షణమంటూ లేదు. అమ్మా.. నాన్నా అనే పిలుపుకోసం ఎదురుచూడని గడియ లేదు.. నాలుగురోజులు దాటినా కనిపించకుండా పోయిన తమ గారాలపట్టి ఎలా ఉందో.. అసలు ఉందో.. లేదో తెలియక తల్లడిల్లిపోతున్నారు... ఇంటి నుంచి తప్పిపోయిన బిడ్డ ఆకలితో ఇన్ని రోజులు అసలు ఎలా ఉందో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నారు.. తప్పిపోయింది అటవీప్రాంతంలో కావడంతో అసలు సజీవంగా ఉందా లేదా అనే అనుమానంతో ఆ కన్నపేగులు కుమిలిపోతున్నాయి. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జానూ) తప్పిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం నుంచీ చిన్నారి జాడ లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. 400మంది పోలీసులు.. గ్రామ జనం .డ్రోన్లు.. డాగ్‌స్క్వాడ్స్.. ఇలా అన్ని కోణాల్లోనూ అన్వేషిస్తున్నా ఆచూకీ దొరకకపోవడం అందరి గుండెలనూ పిండేస్తోంది.
అసలేం జరిగింది?
సీహెచ్ అగ్రహారంలో చిన్నారి తల్లిదండ్రులు సుంకర గణేశ్, భవానీ స్థానికంగా 50ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. తోటలో వీరి ఒక్కరి గృహమే ఉంది. చుట్టూ దట్టమైన కొండలున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి బయటకు వెళ్తున్న తండ్రిని చూసి వెంటపడింది. దీంతో అతడు చిన్నారిని లోపలికి తీసుకొచ్చి.. ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నెలల వయస్సున్న తన రెండో కూతురి ఆలనాపాలనలో చిన్నారి తల్లి నిమగ్నమై ఉంది. జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతో తండ్రి వెంట వెళ్లి ఉంటుందని ఆమె భావించింది. గంట తర్వాత తండ్రి రావడంతో ఆరా తీసింది. బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. సీసీ కెమెరాలో పరిశీలిస్తే తండ్రి బయటికి వెళ్లిన కాసేపటికే చిన్నారి బయటికి వెళ్లడం కనిపించింది. చిన్నారి వెంట ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా ఉంది.
కీలకంగా మారిన పెంపుడు కుక్క
శనివారం చిన్నారితోపాటే వెళ్లిన పెంపుడు కుక్క మూడు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. దాని ఒంటిపై చిన్నచిన్న దెబ్బలున్నాయి. పైగా ఆ శునకం వచ్చీరాగానే పాప తల్లి చున్నీని నోటితోలాగి.. స్వల్పంగా గాయపర్చి అక్కడి నుంచి కొండవైపు పరుగులు తీసింది. ఈ నేపథ్యంలో దాని జాడ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా దొరకలేదు. అయితే అనూహ్యంగా బుధవారం రాత్రి కుక్క మళ్లీ తిరిగొచ్చేసింది. దాన్ని పోలీసు బలగాలు పట్టుకుని పాప ఇంటి వద్ద కట్టేసి ఉంచాయి. గురువారం ఆ కుక్కతో పాప జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం. మరోవైపు దట్టమైన అటవీప్రాంతం కావడంతో అడవిపందుల సంచారం అధికంగా ఉంది. అవి మనుషులను తినకపోయినా రెండేళ్ల జానూ బరువు తక్కువ కావడంతో ఈడ్చుకుపోయి ఉంటాయనే కోణంతో గాలిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అంత లోపలకు వెళ్లి క్షుణ్నంగా పరిశీలించే పరిస్థితులు లేవని పోలీసులు చెబుతున్నారు. వర్షాలతో అటవీప్రాంతంలోకి వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు.