Share News

తుంగభద్ర నుంచి ఎల్లెల్సీకి నీరు

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:05 AM

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీ కాలువకు గురువారం నీరు విడుదల చేశారు.

తుంగభద్ర నుంచి ఎల్లెల్సీకి నీరు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై కర్నూలు కలెక్టర్‌ స్పందన

కర్నూలు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీ కాలువకు గురువారం నీరు విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల తాగు, సాగునీరు అందించే జీవనాడులైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు వరద ప్రవాహం లేక వెలవెలబోతున్నాయి. పల్లెసీమల్లో బిందెడు నీటి కోసం ప్రజలు పడుతున్న తాగునీటి ఇబ్బందులపై ‘గుక్కెడు నీళ్లు దొరికేనా..’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 7న కథనం ప్రచురించింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి స్పందించారు. తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే స్పందించిన జలవనరుల శాఖ ఎస్‌ఈ జి. శైలేశ్వర్‌ తాగునీటి కోసం 900 క్యూసెక్కులు ఎల్లెల్సీ కాలువకు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఇండెంట్‌ ఇచ్చారు. కర్ణాటక కూడా 200 క్యూసెక్కులకు ఇండెంట్‌ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం గురువారం 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jul 17 , 2026 | 05:05 AM