Share News

చేయని పనులకూ చెల్లింపులా..?

ABN , Publish Date - May 12 , 2026 | 05:30 AM

గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా క్లియర్‌ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.

చేయని పనులకూ చెల్లింపులా..?

  • తుంగభద్ర బిల్లుల చెల్లింపుల్లో మాయ... రూ.211.46 కోట్లకు ఎల్‌ఓఏ జారీ చేసిన టీబీపీ బోర్డు కార్యదర్శి

  • చేయని పనులు, పూర్తికాని వాటికీ

  • వైసీపీ కాంట్రాక్టర్‌కు పెద్ద మొత్తంలో బిల్లులు

  • తెరవెనుక కూటమి ప్రభుత్వంలోని కీలక రాయలసీమ నేత చక్రం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా క్లియర్‌ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే చేయని పనులకు, పూర్తి కాని పనులకు కూడా బిల్లుల చెల్లింపులకు రంగం సిద్ధం చేయడమే విడ్డూరంగా ఉంది. తుంగభద్ర దిగువ కాలువ(టీబీపీ ఎల్లెల్సీ) ఆధునికీకరణ పనులకు సబంధించి రూ.211.46 కోట్ల బిల్లులు చెల్లింపులకు టీబీపీ బోర్డు కార్యదర్శి లెటర్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌(ఎల్‌వోఏ) ఇచ్చారు. పూర్తి చేసిన పనులతో పాటు చేయని పనులకు, వివిధ దశల్లో ఉన్న పనులకు కూడా ఎల్‌వోఏ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ హయాంలో తుంగభద్ర బోర్డులో చక్రం తిప్పి బళ్లారిలో స్థిరపడిన ఆ పార్టీ కాంట్రాక్టరుకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నట్లు సమాచారం. బిల్లులు పొందుతున్న కాంట్రాక్టర్లలో వైసీపీ సానుభూతిపరులు, ఇతరులు ఉన్నారు. ఈ బాగోతంలో కూటమి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న సీమ జిల్లాలకు చెందిన ఓ కీలక నేత పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ నేపథ్యం

రాయలసీమ కరువు పల్లెసీమల జీవనాడి తుంగభద్ర జలాశయం. టీబీపీ హైలెవల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సీ), టీబీపీ లో-లెవల్‌ కెనాల్‌ (ఎల్లెల్సీ) ద్వారా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. తుంగభద్ర కాలువల నిర్మాణాలు 1955-57 నాటికే పూర్తి చేసి తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) కింద ఖరీఫ్‌, రబీలో 1,51,413 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు పట్టణాలతో పాటుగా 139 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. కృష్ణా ట్రైబ్యునల్‌-1 అవార్డు మేరకు 24 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. కర్ణాటక రాష్ట్రం హొస్పెట్‌ సమీపంలో గుండ్లకేరి 0/0 కి.మీ. నుంచి కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆనవాలు దగ్గర 250.500 కిలో మీటర్ల వరకు ప్రధాన కాలువ తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు పర్యవేక్షలో ఉంది. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఎల్లెల్సీ కాలువ గట్లు బలహీనంగా మారాయి. వాటా జలాలు అందక ఏటేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో 2022-23లో రూ.919 కోట్లతో ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తొలి దశలో 2022-23, 2023-24లో రూ.519.80 కోట్లతో 11 ప్యాకేజీలుగా విభజించి సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేపట్టారు. అప్పట్లో టెండర్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి.


కూటమి ప్రభుత్వం వచ్చాక..

కర్నూలు జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ 205 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకు రూ.300 కోట్లు, అనంతపురం జిల్లాలో టీబీపీ హెచ్చెల్సీ పరిధిలో రూ.100 కోట్లు కలిపి రూ.400 కోట్లతో చేపట్టే ఫేజ్‌-2 ఆర్‌సీసీ లైనింగ్‌ పనులకు 2023 జనవరిలో 13 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. బిల్లులు రావనే భయంతో నాడు కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ఈ పనులు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని బళ్లారికి చెందిన ఓ కాంట్రాక్టరు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు టీబీపీ బోర్డు ఉన్నతాధికారులు ఈ పనులు రద్దు చేయలేదు. దీనివెనుక బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సానుభూతిపరుడైన ముఖ్య కాంట్రాక్టరు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రావడంతో బిల్లులకు ఢోకా లేదనే ధీమాతో 2025 మే, జూన్‌ నెలల్లో సీసీ లైనింగ్‌ పనులు చేపట్టారు. వీటితో పాటుగా 2022-23, 23-24, 24-25లో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

చేయని పనులకు ఎల్‌వోఏ

టీబీపీ ఎల్లెల్సీ పనులకు సంబంధించి రూ.211.46 కోట్లను 2026-27 ప్రణాళిక బడ్జెట్‌ కింద కర్ణాటక ట్రెజరీ-2 పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి బిల్లులు చెల్లింపులకు టీబీపీ ఎల్లెల్సీ బళ్లారి ఈఈకి అనుమతిస్తూ ఈ నెల 2న బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి లెటర్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌ (ఎల్‌వోఏ) జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో చేసిన పనులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంబుక్‌ రికార్డు చేయాలి. క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు, సూపర్‌ చెక్‌ చేశాక ఎస్‌ఈలు బిల్లుల కోసం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) పంపాల్సి ఉంటుంది. ఎల్‌వోసీలో పేర్కొన్న పనులు జరిగాయో లేదో నిర్ధారించుకున్నాకే ఎల్‌వోఏ జారీ చేయాలి. అయితే బోర్డు సెక్రటరీ జారీ చేసిన ఎల్‌వోఏలో 106 పనులకు రూ.211.46 కోట్లు చెల్లింపులకు అనుమతులు ఇచ్చారు. అందులో 84 నుంచి 106 వరకు.. 23 పనులకు సంబంధించి బిల్స్‌ అండర్‌ ప్రాసెస్‌ (బిల్లుల తయారీ ప్రక్రియ)లో ఉన్నాయని చూపారు. ఇందులో చేయని పలు పనులకు కూడా ఎల్‌వోసీ, ఎల్‌వోఏ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ నిధుల స్వాహాకే ఎల్‌వోఏ జారీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. బడా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో పెద్దపీట వేసి చిన్నచిన్న కాంట్రాక్టర్లను వేధిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. బిల్లుల చెల్లింపులు, ఎల్‌వోఏ జారీ వెనుక రాయలసీమకు చెందిన ముఖ్య నాయకుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకువెళ్లగా, ప్రభుత్వ నిబంధనల మేరకే ఎల్‌వోఏ జారీ చేశామని, చేయని పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించబోమని పేర్కొన్నారు.


3.jpg

ఆనవాళ్లే లేకున్నా..

హోళగుంద మండలంలో టీబీపీ ఎల్లెల్సీ 196 కి.మీ. వద్ద హౌరా స్టీల్‌ వంతెన నిర్మించిన ఆనవాళ్లు లేవు. దీనితో పాటు 198.500, 201.050 కి.మీ. వద్ద మూడు హౌరా స్టీల్‌ బ్రిడ్జిలకు రూ.12.87 లక్షలు బిల్లుల చెల్లింపునకు ఎల్‌వోఏ ఇచ్చారు. ఎక్కడా నిర్మాణాలు జరగలేదు.

1.jpg

పనులు చేయకుండానే..

తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో టీబీపీ ఆర్‌బీఎల్లెల్సీ 170/200 కి.మీ. వద్ద ఉన్న అండర్‌ టన్నెల్‌(యూటీ) ఇది. దీనితో పాటు 173/850 కి.మీ. వద్ద ఉన్న యూటీలకు షాట్‌ క్రీటింగ్‌, గ్రౌటింగ్‌ పనులకు రూ.35.10 లక్షల బిల్లుల చెల్లింపునకు ఎల్‌వోఏ జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. యూటీ గోడ రాళ్ల మధ్య సిమెంట్‌ పూత పూశారే కానీ అడుగు భాగంలో లీకేజీలు రాకుండా యూటీలకు షాట్‌ క్రీటింగ్‌, గ్రౌటింగ్‌ పనులు చేయలేదు.

2.jpg

పునాది కూడా తీయలేదు..

హోళగుందలోని టీబీపీ ఆర్‌బీఎల్లెల్సీ కాలనీలో ఎంఎం టైప్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలం ఇది. ఇక్కడ పునాది కూడా తీయలేదు. అయితే.. బోర్డు సెక్రటరీ జారీ చేసిన ఎల్‌వోఏ పనుల జాబితాలో వరుస సంఖ్య 105 కింద వీఎల్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు రూ.28.08 లక్షలు ఇవ్వాలని చూపారు. ఇది ఎలా సాధ్యం..?

Updated Date - May 12 , 2026 | 05:30 AM