Share News

తుంగభద్రకు రికార్డు టైంలో గేట్లు

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:26 AM

తుంగభద్ర క్రస్ట్‌ గేట్ల ఏర్పాటులో టీబీపీ బోర్డు ఇంజనీర్లు రికార్డు నెలకొల్పారు. ఒక్క సీజన్‌ (ఆరు నెలలు)లోనే తుప్పుపట్టిన పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్తవి అమర్చారు.

తుంగభద్రకు రికార్డు టైంలో గేట్లు

  • ఒకే సీజన్‌లో 33 క్రస్ట్‌ గేట్లు తొలగించి కొత్తవి ఏర్పాటు

  • టీబీపీ బోర్డు ఇంజనీర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

(ఆంధ్రజ్యోతి-కర్నూలు)

తుంగభద్ర క్రస్ట్‌ గేట్ల ఏర్పాటులో టీబీపీ బోర్డు ఇంజనీర్లు రికార్డు నెలకొల్పారు. ఒక్క సీజన్‌ (ఆరు నెలలు)లోనే తుప్పుపట్టిన పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్తవి అమర్చారు. దేశంలోనే ఇది ఒక రికార్డు అని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. 2024 ఆగస్టు 9న వరదకు కొట్టుకుపోయిన గేటు స్థానంలో.. స్టాప్‌లాగ్‌ ఏర్పాటు మొదలుకొని నిపుణుల కమిటీ అధ్యయనం, నిధులు మంజూరు, కొత్త గేట్లు అమర్చడం వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో విజయవంతంగా క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేయడంతో టీబీపీ బోర్డు ఇంజనీర్లను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల సహకారంతో అనుకున్న గడువులోగా క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశాం. ఈ సీజన్‌ వరదను విజయవంతంగా నిర్వహిస్తాం’ అని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.


ఒకే సీజన్‌లో 33 గేట్లు ఏర్పాటు రికార్డు

తుంగభద్ర డ్యాం పాత గేట్ల తొలగింపు, కొత్త గేట్ల ఏర్పాటు కోసం రూ.51 కోట్లతో కాంట్రాక్టు సంస్థ.. టీబీపీ బోర్డు ఇంజనీర్లతో 2025 జూన్‌ 10న ఒప్పందం చేసుకుంది. నాటి నుంచే ప్రాజెక్టు సమీపంలోనూ, గదగ్‌ దగ్గర రెండు ప్రాంతాల్లో గేట్ల తయారీ (ఫ్యాబ్రికేషన్‌) పనులు మొదలు పెట్టింది. గత డిసెంబరు 5న బోర్డు సెక్రెటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, బోర్డు కర్ణాటక సభ్యుడు కృష్ణమూర్తి కులకర్ణి తదితరులు ప్రత్యేక పూజలు చేసి చేసి నూతన గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు పాత గేట్ల తొలగింపు, మరోవైపు కొత్త గేట్లు అమర్చే పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జనవరి 12న 18వ నంబరు గేటు ఏర్పాటు చేసి దిగ్విజయంగా ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. మొదట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా, వాటిని అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా ఒక్కో గేటును అమరుస్తూ ముందుకు సాగారు. ఒక్కో గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు, 49.5 టన్నుల బరువు ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. ఏప్రిల్‌ 14 నాటికి 129 రోజుల్లో 25 గేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 22 గేట్ల ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి చేశారు. ఆరోజు ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు డ్యామ్‌ను సందర్శించి ప్రతి గేటును క్షుణంగా పరిశీలించారు. గేట్ల ఏర్పాటు, నిర్వహణపై టీబీపీ బోర్డు ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. మే ఆఖరులోగా మొత్తం గేట్లు ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. అనుకున్న గడువులోగా, కేవలం ఆరు నెలల్లోపే మొత్తం గేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. 18 గేట్లకు చైన్లు కూడా తీసుకువచ్చి.. ఏడు గేట్లకు అమర్చే పనులు కూడా పూర్తి చేశారు. ఇంత తక్కువ కాలంలో పాత గేట్లను తొలగించి, కొత్త గేట్లను ఏర్పాటు చేయడం దేశంలోనే సరికొత్త రికార్డు అని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇచ్చిన గడువులోగా తుంగభద్ర డ్యాం గేట్లు ఏర్పాటులో బోర్డు ఇంజనీర్ల కృషిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

నెలాఖరులోగా ప్రారంభం

  • మంత్రి నిమ్మల, టీబీ చైర్మన్‌ పాండే ప్రకటన

తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తుంగభద్ర బోర్డు చైర్మన్‌ ఎస్‌ఎన్‌ పాండే సంయుక్తంగా ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మలతో పాండే సమావేశమయ్యారు. తుంగభద్ర గేట్లను ఈ నెల 25న ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ సూత్రప్రాయంగా అంగీకరించారని, అయితే కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు తేదీని ఖరారు చేయాల్సి ఉందని చర్చించుకున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 04:26 AM