Share News

ఆ ఒక్కమాటతో తుంగభద్రకు కొత్త గేట్లు..!

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:59 AM

తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన సమయంలో ‘గో ఆల్‌ అవుట్‌’ అంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసాతో..

ఆ ఒక్కమాటతో తుంగభద్రకు కొత్త గేట్లు..!

  • ‘గో ఆల్‌ అవుట్‌’ అంటూ నాడు సీఎం చంద్రబాబు భరోసా

  • ఇప్పటికే 18 గేట్లు.. ఈ నెలాఖరుకు మొత్తం 33 గేట్లు పూర్తి: పయ్యావుల

అనంతపురం, అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన సమయంలో ‘గో ఆల్‌ అవుట్‌’ అంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసాతో.. డ్యాం 33 గేట్లు మార్చేందుకు సిద్ధమయ్యామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా టీబీ డ్యాం పాత గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 18 గేట్లు మార్చామని, ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మొత్తం 33 గేట్ల అమరిక పూర్తవుతుందని వెల్లడించారు. వాస్తవానికి మే నెలాఖరుకల్లా ఈ పని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. పనులు వేగంగా సాగడం వల్ల నెల ముందే పూర్తికానుందని చెప్పారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల అమరిక పనులను పరిశీలించేందుకు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, పార్టీ మీడియా రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ బీవీ వెంకటరాముడు, కర్ణాటక, ఏపీ ఇంజనీర్లతో కలిసి మంగళవారం టీబీ డ్యాం వద్దకు మంత్రి కేశవ్‌ వెళ్లారు. దాదాపు గంటకుపైగా గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సీజన్‌లో ఒక డ్యాంకు సంబంధించి 33పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేయడం దేశంలోనే ఓ అరుదైన రికార్డు అని అన్నారు. ‘గతేడాది తుంగభద్ర డ్యాం 19వ గేట్‌ కొట్టుకుపోయిన రోజు ఎంతో మానసిక క్షోభ అనుభవించాం.


సీఎం చంద్రబాబు ‘గో ఆల్‌ అవుట్‌’ అని చెప్పిన మాటతోనే... డ్యాం గేట్లన్నీ మార్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నాం. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో ఏప్రిల్‌ నెలాఖరుకల్లా కొత్త గేట్ల ఏర్పాటు పూర్తవుతుంది’ అని వివరించారు. ముఖ్యమంత్రి చూపిన చొరవ, కర్ణాటక ప్రభుత్వ సహకారం, విశ్రాంత ఇంజనీర్‌ కన్నయ్యనాయుడు నైపుణ్యంతో గేటును అమర్చి, ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడాం అంటూ ఆనాటి పరిస్థితి తలచుకుని పయ్యావుల భావోద్వేగానికి గురయ్యారు. డ్యాం వద్ద నుంచే సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. గేట్ల బిగింపు ప్రక్రియ ఏప్రిల్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయని చెప్పారు. గేట్ల బిగింపు పనులు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Updated Date - Apr 01 , 2026 | 06:00 AM