Share News

త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’!

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:24 AM

తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన తర్వాత హుండీలో వేయడానికి చేతిలో సరిపడా డబ్బులు లేవని ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు.

త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’!

  • హుండీలో నగదు రహిత కానుకలకు టీటీడీ కసరత్తు

  • యూపీఐ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించి... రూ.100 నుంచి రూ.లక్ష వరకు పత్రాల కొనుగోలు

  • ఆ పత్రాన్ని ఆలయ హుండీలో సమర్పించే అవకాశం

  • తిరుపతి, తిరుమలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

  • 28న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ?

తిరుమల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన తర్వాత హుండీలో వేయడానికి చేతిలో సరిపడా డబ్బులు లేవని ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు. భక్తుల చేతిలో నగదు లేకపోయినా హుండీలో కానుకలు వేసేలా టీటీడీ త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. భక్తులు తమ స్థోమతకు తగినట్టు మొక్కులు చెల్లించుకునేలా నూతన పద్ధతిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం శ్రీవారిని ఏటా దాదాపు 2.5కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించడమనే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్‌లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025లో హుండీ ఆదాయం రూ.1,383 కోట్లు వచ్చింది. ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలు అధికమయ్యాయి. దాదాపు ప్రతి ఒక్కరూ యూపీఐ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ దిశగా ‘శ్రీవారి ముడుపు పత్రం’ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.


వీటిద్వారా భక్తులు రూ.100 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించి ముడుపు పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఆ పత్రాలను ఆలయంలోని హుండీలో సమర్పించవచ్చు. వాస్తవానికి ముడుపు పత్రాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే స్వామివారి ఖాతాలకు నగదు జమ అయిపోతుంది. అయితే హుండీలో మొక్కులు చెల్లించాలన్న భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ పత్రాన్ని సమర్పించే విధానాన్ని అమలుచేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 28న తిరుమలలో జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2026 | 05:25 AM