గ్రాము నుంచి శ్రీవారి డాలర్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:43 AM
పెరుగుతున్న బంగారు ధరలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకూ అవకాశం కల్పించేలా టీటీడీ ఒకటి నుంచి 10 గ్రాముల వరకు బరువు కలిగిన బంగారు, వెండి...
త్వరలో అందుబాటులోకి
తిరుమల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న బంగారు ధరలను దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకూ అవకాశం కల్పించేలా టీటీడీ ఒకటి నుంచి 10 గ్రాముల వరకు బరువు కలిగిన బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కొన్నేళ్లుగా శ్రీవారి ఆలయం ముందున్న కౌంటర్‌లో 10, 5, 2 గ్రాముల బంగారు, 50, 10, 5 గ్రాముల్లో వెండి డాలర్లను విక్రయిస్తోంది. సామాన్య భక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని 1 నుంచి 10 గ్రాముల వరకు డాలర్లను అందుబాటులోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని బోర్డు ఇటీవల అధికారులను ఆదేశించింది.
అబ్రిపోస్ సేవల కొనసాగింపునకు టీటీడీ గ్రీన్‌సిగ్నల్
తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు, విభజన వంటి ప్రక్రియకు అబ్రిపోస్ సంస్థ సేవలను మరో ఏడాది కొనసాగించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్, ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలుచేయడానికి టీటీడీ చర్యలు చేపడుతోంది. అయితే ఈ సంస్కరణలు దశలవారీగా అమలుకావాల్సి ఉండటంతో తక్షణమే ప్రస్తుత విధానాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో ఏప్రిల్ నుంచి మరో ఏడాది లేదా సంస్కరణలు అమల్లోకి వచ్చేంతవరకు అబ్రిపోస్ సంస్థను కొనసాగించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.