మరో సంస్థకు అగరుబత్తీల తయారీ బాధ్యత
ABN , Publish Date - May 11 , 2026 | 04:13 AM
అగరుబత్తీల తయారీకి టెండర్లు పిలిచి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ పలు అవకతవకలకు..
టెండర్లు పిలిచేందుకు టీటీడీ సన్నద్ధం
తిరుపతి(టీటీడీ), మే 10 (ఆంధ్రజ్యోతి): అగరుబత్తీల తయారీకి టెండర్లు పిలిచి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్టు టీటీడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు ఇచ్చిన ఆరు నెలల గడువు ముగిసే నాటికి టెండరు ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీటీడీ ఆలయాల నుంచి సేకరించిన పూల ద్వారా 2021 నుంచి టీటీడీ అగరుబత్తీలను తయారు చేస్తోంది. ప్లాంటు, యంత్రాల ఏర్పాటుతో పాటు అగరుబత్తీల ఉత్పత్తికి దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ టీటీడీతో ఒప్పందం చేసుకుంది. గడువు పూర్తయిన తర్వాత ప్లాంటు, యంత్రాలు టీటీడీకి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత నెల 5వ తేదీతో గడువు పూర్తయ్యాక మరో ఐదేళ్లు పొడిగించాలని ఆ సంస్థ టీటీడీని కోరింది. దీంతోపాటు ప్లాంటు విస్తరణ, ఉత్పత్తి పెంచడం, కొత్త బ్రాండ్లను తీసుకురావడం వంటి ప్రతిపాదనలను సంస్థ ప్రతినిధులు టీటీడీ ముందుంచారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు అటవీ శాఖ డీఎ్‌ఫవో, అదనపు ఎఫ్‌ఏ అండ్ సీఏవో, డిప్యూటీ ఈవో, ఎస్వీ గోశాల డైరెక్టర్‌లతో టీటీడీ ఒక కమిటీ వేసింది. ఒప్పందం పొడిగింపు, కొత్తగా టెండర్లు పిలవడం వల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనే అంశాలను పరిశీలించిన కమిటీ సభ్యులు టీటీడీ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా టెండర్లు పిలిచి కొత్త సంస్థకు అప్పగించేందుకే టీటీడీ సిద్ధమైంది. కాగా.. దేశంలోని పలు ప్రముఖ సంస్థలు శ్రీవారిపై ఉన్న భక్తితో అగరుబత్తీలను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. టీటీడీ మాత్రం టెండరు ప్రక్రియ ద్వారానే సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించింది.