మేల్‌చాట్ వస్త్రాలు అందిస్తాం
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:37 AM
తిరుమల శ్రీవారికి వినియోగించే మేల్‌చాట్ వస్త్రంతోపాటు ఉత్తరీయాలను టీటీడీ ప్రమాణాలు, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఇచ్చేందుకు పలు సంస్థలు/వ్యక్తులు ముందుకు వస్తున్న నేపథ్యంలో స్వీకరించాలని టీటీడీ.....
ముందుకొస్తున్న దాతలు.. స్వీకరించనున్న టీటీడీ
ఆప్కో, కో-ఆప్టెక్స్ ద్వారా ఇతర వస్త్రాల కొనుగోలు
తిరుపతి(టీటీడీ), మార్చి 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి వినియోగించే మేల్‌చాట్ వస్త్రంతోపాటు ఉత్తరీయాలను టీటీడీ ప్రమాణాలు, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఇచ్చేందుకు పలు సంస్థలు/వ్యక్తులు ముందుకు వస్తున్న నేపథ్యంలో స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే నాణ్యత పరీక్షల్లో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే తీసుకోవాలని ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీటీడీలో వివిధ అవసరాల కోసం వినియోగించే వస్త్రాలను ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ నుంచి తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. వీటి ధరలను ఇప్పటికే ఆయా సంస్థలు సమర్పించడంతో నాణ్యత, ధరలను పరిశీలించేందుకు అనుగుణంగా పాలకమండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, ప్రశాంతి రెడ్డి, సుచిత్రా ఎల్లాతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బోర్డుకు తమ సూచనలు అందించనుంది. మరోవైపు పాలిస్టర్ వస్త్రాల కొనుగోలుకు మాత్రం బోర్డు నిరాకరించింది. టీటీడీ మొత్తం 12 రకాల వస్త్రాలను కొనుగోలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా శ్రీవారికి ఉపయోగించే మేలిమిరకం జరీ మేల్‌చాట్, ఉత్తరీయం, వస్త్రం ఉన్నాయి. అయితే వైసీపీ హయాంలో పట్టుకు బదులు పాలిస్టర్ వస్త్రాలు వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆప్కో ద్వారా 9 రకాల వస్త్రాలను సేకరించేందుకు టీటీడీ నిర్ణయించింది. స్వామివారితోపాటు వివిధ అవసరాలకు వినియోగించే పట్టు వస్త్రాల నాణ్యతా ప్రమాణాలను రూపొందించేందుకు హైదరాబాదులోని డెవల్‌పమెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్‌లూమ్స్ డాక్టర్ ఎస్.అరుణ్ కుమార్‌ను టీటీడీ నియమించింది. ఆయన ఇచ్చిన ప్రమాణాల మేరకు వస్త్రాల కొనుగోలుకు సిద్ధమైంది. వస్త్రాలను ఆప్కో, కో-ఆప్టెక్స్ నుంచి నామినేషన్ విధానంపై తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరు 30వ తేదీన ఆప్కో, కో-ఆప్టెక్స్ అధికారులతో టీటీడీ కొనుగోలు కమిటీ సమావేశమైంది. రెండింటి నుంచి 50:50 నిష్పత్తిలో వస్త్రాలను తీసుకునేందుకు కొనుగోలు కమిటీ సిఫారసు చేసింది.
దాతల సహకారం..
మేల్‌చాట్, ఉత్తరీయం వస్త్రాలకు సంబంధించి పలు ప్రముఖ సంస్థలు పైలెట్ ప్రాజెక్టు కింద తయారు చేసి టీటీడీకి ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ వస్త్రాలను ప్రభుత్వ వస్త్ర పరీక్షశాలల్లో పరీక్షించినట్టు నోడల్ అధికారి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సంస్థలన్నీ టీటీడీ ప్రమాణాలు, ఆగమశాస్త్రాల ప్రకారం శ్రీవారికి వినియోగించే మేల్‌చాట్ వస్త్రంతోపాటు ఉత్తరీయం తయారు చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలిపారు. స్వామి వారికి మేల్‌చాట్ వస్త్రం, ఉత్తరీయాలు స్పాన్సర్ చేసేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ వస్త్రాలను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత వినియోగించుకునేందుకు ఆస్కారం ఉందన్న అభిప్రాయాన్ని పాలకమండలి సమావేశానికి హాజరైన సభ్యులు వ్యక్తం చేశారు. దీంతో దాతల నుంచి వీటిని తీసుకునేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.