Share News

కల్తీ నెయ్యి కథ ఇదీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:18 AM

గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు.

కల్తీ నెయ్యి కథ ఇదీ

  • 2019 వైసీపీ సర్కారులో బీజం.. నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపు.. 2022లోనే కల్తీ వ్యవహారం వెలుగులోకి

  • నెయ్యి సరఫరా డెయిరీలతో లంచం డిమాండ్‌ చేసిన వైవీ పీఏ

  • కూటమి వచ్చాక వ్యవహారం వెలుగులోకి

  • కల్తీ జరిగినట్టు ల్యాబ్‌లో నిర్ధారణ

  • సీబీఐ సిట్‌ విచారణ.. చార్జిషీట్‌

  • 2019-24 మధ్య టీటీడీకి రూ.250 కోట్ల నెయ్యి సరఫరా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. టీటీడీ నిబంధనలను అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్ది కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారు. కాసులకు కక్కుర్తి పడి తిరుమలలో అపచారం చేశారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దొంగ అరుపులు అరుస్తున్నారు. తమకేమీ తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకూ టీటీడీ నెయ్యి కొనుగోలులో ఏం జరిగింది? ఏయే నిబంధనలను ఎప్పుడు సవరించారు? ఏ ఉద్దేశంతో నిబంధనలు మార్చారు? కల్తీ ఎలా జరిగింది. వంటి వివరాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి.

2019లో వైసీపీ ప్రభుత్వంలో

నెయ్యి కొనుగోలు నిబంధనలు మార్చేశారు.

2022 ఆగస్టు 3-కల్తీ వెలుగులోకి

సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ టీటీడీకి వచ్చే నెయ్యిని టెస్ట్‌ చేయగా నూనెలతో కల్తీ చేసినట్లు తేలింది. బకానీ అప్పటి టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యం వీటిని పట్టించుకోలేదు. పైగా 2022 అక్టోబరులో మళ్లీ అవే డెయిరీలకు కొత్త ఆర్డర్లు ఇచ్చారు.

2022-వైవీ పీఏ పాత్ర

నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన పీఏ చిన్నప్పన్న ప్రొక్యూర్‌మెంట్‌ జీఎంను కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు తీసుకున్నారు.


2022-లంచం డిమాండ్‌

చిన్నప్పన్న భోలే బాబా డెయిరీని సంప్రదించి ప్రతి కిలో నెయ్యికి రూ.25 లంచంగా ఇవ్వాలని కోరారు. సదరు కంపెనీ దీనికి అంగీకరించలేదు. దీంతో ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ద్వారా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రెండో తనిఖీలు నిర్వహించాలని, త్వరలో పిలిచే నెయ్యి టెండర్లలో సదరు కంపెనీకి అర్హత లేకుండా చేయాలని ఒత్తిడి తెచ్చారు.

2022-భోలే బాబా డిస్‌క్వాలిఫై

చిన్నప్పన్న ప్రీమియర్‌ అగ్రి ఫుడ్‌ కంపెనీలతో పరిచయం పెంచుకుని, కొత్త టెండర్లలో భోలే బాబా డెయిరీని డిస్‌క్వాలిఫై చేయించారు.

2022-రంగంలోకి కొత్త డెయిరీలు

భోలే బాబా డెయిరీ 2022 వరకూ టీటీడీకి నేరుగా నెయ్యి సరఫరా చేసింది. తర్వాత ఆ కంపెనీని బ్లాక్‌లి్‌స్టలో పెట్టారు. అధికారుల అండతో వైష్ణవీ డెయిరీ, ఏఆర్‌డెయిరీ, మాల్‌ గంగా వంటి డెయిరీలు షెల్‌ కంపెనీల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేశాయి.

2024 జూలై 17-నెయ్యి ట్యాంకర్ల రిజెక్ట్‌

కొత్త టెండర్ల ద్వారా ఎంపికైన డెయిరీల నుంచి వచ్చే నెయ్యి ట్యాంకర్లను అనేకసార్లు టీటీడీ తిరస్కరించింది. అది కూడా సాధారణ తనిఖీల్లోనే ఆ ట్యాంకర్లను తిరస్కరించింది. కల్తీ నెయ్యి కేసులో తొలిసారి ఇక్కడే వెలుగులోకి వచ్చింది.


2024 జూలై 20-ముఖ్యమంత్రి సూచన

టీటీడీ వ్యవస్థలో లోపాలు సరి చేయాలని, లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచాలని, నాణ్యమైన నెయ్యి టీటీడీకి వచ్చేలా చూడాలని, ఆన్‌లైన్‌ దర్శనం టికెట్ల వ్యవహారాన్ని సరి చేయాలని, అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు ఈవో ప్రకటన విడుదల చేశారు.

2024 జూలై 22-నెయ్యి శాంపిల్స్‌ సేకరణ

టీటీడీ తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యిని పరీక్షల కోసం అధికారులు నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు పంపించారు.

2024 జూలై 23- కల్తీ వ్యవహారం

లడ్డూ నాణ్యత తగ్గిందని, నాణ్యమైన నెయ్యి వాడితేనే నాణ్యమైన లడ్డూ వస్తుందని నిపుణులు చెప్పినట్లు ఈవో వెల్లడించారు. టీటీడీలో ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం చాలా బలహీనంగా ఉందని, టీటీడీలో నెయ్యిని టెస్ట్‌ చేసే పరిస్థితి లేదన్నారు. నెయ్యిలో నూనెతో పాటు ఏదో తెలియని పదార్థాలు కలిసినట్లు గుర్తించామని ఈవో ప్రకటించారు.

2024 ఆగస్టు 21-కల్తీ నిర్ధారణ

నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారిస్తూ నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు నివేదిక ఇచ్చింది.

2024 సెప్టెంబరు 18-సీఎం ప్రకటన

టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మంగళగిరిలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు.

2024 సెప్టెంబరు 19-సుబ్బారెడ్డి పిటిషన్‌

కల్తీ నెయ్యి, కల్తీ లడ్డూ వ్యవహారంపై జ్యుడిషియల్‌ విచారణ చేపట్టాలని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

2024 సెప్టెంబర్‌ 25-క్రిమినల్‌ కేసు

వైసీపీ ప్రభుత్వ సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణపై కేసు నమోదైంది.

2024 అక్టోబరు 4-సీబీఐ నేతృత్వంలో సిట్‌

సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


2025 డిసెంబరు వరకు సిట్‌ విచారణ

సీబీఐ బృందం గత ఏడాది డిసెంబరు వరకు 14 నెలలు 12 రాష్ట్రాలో దర్యాప్తు చేపట్టింది. మరికొన్ని ప్రదేశాల్లో సోదాలూ నిర్వహించింది.

2025 ఫిబ్రవరి 9-తొలి అరెస్టులు

భోలే బాబా డెయిరీకి చెందిన పోమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వైష్ణవీ డెయిరీకి చెందిన అపూర్వ చావ్లా ఏఆర్‌ డెయిరీకి చెందిన డా.రాజు రాజశేఖరన్‌తో పాటు అజయ్‌కుమార్‌ సుగంద్‌, ఆశీష్‌ అగర్వాల్‌, హర్మోహన్‌రాణాలను అరెస్ట్‌ చేశారు.

2025 మే-తొలి చార్జిషీట్‌

సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. 24 మందిని నిందితులుగా చేర్చింది.

2025 నవంబరు 28-టీటీడీ జీఎం అరెస్ట్‌

టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యంను సిట్‌ అరెస్ట్‌ చేసింది.

2026 జనవరి 23-చివరి చార్జిషీట్‌

2019-24 మధ్య 68 లక్షల కిలోల నెయ్యి అంటే దాదాపు రూ.250 కోట్ల విలువైన నెయ్యి సరఫరా అయినట్లు సిట్‌ విచారణలో గుర్తించింది. ఆవు నెయ్యిని పోలి ఉండేలా వివిధ రకాల కెమికల్స్‌, నూనెలు, ఇతర వస్తువులు కలిపినట్లు గుర్తించింది. 36 మందిని నిందితులుగా చేర్చింది.

వైవీ పీఏ ఖాతాలో నగదు

చిన్నప్పన్న బ్యాంక్‌ ఖాతాలో రూ.4.69 కోట్లు జమ అయినట్టు గుర్తించారు. ఈ డబ్బును వివిధ ఖాతాల్లోకి మళ్లించారు.

Updated Date - Jan 30 , 2026 | 05:19 AM