ఎస్వీ ఆపన్న హృదయ పథకానికి ఆదరణ
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:26 AM
టీటీడీ ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం(ఒకసారి మాత్రమే) కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
రూ.లక్ష ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం
విరాళాలిచ్చేందుకు భక్తుల ఆసక్తి
తిరుమల, మే 31 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం(ఒకసారి మాత్రమే) కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ఆధ్వర్యంలో నవజాత శిశువులు, చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన నిధులను దాతల ద్వారా సమీకరించేందుకు టీటీడీ 2022లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.కోటి విరాళమిచ్చే దాతలు ఇప్పటికే ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా లభించే ప్రత్యేక సదుపాయాలను అందుకుంటున్నారు. అలాగే వైద్య పరికరాల కొనుగోలు, ఆస్పత్రి నిర్మాణం కోసం ఎక్కువ విరాళాలు ఇచ్చేవారికి కూడా టీటీడీ ప్రివిలేజెస్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు అవసరమయ్యే మందులు, ఆక్సిజనేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇంప్లాంట్ల కోసం సుమారు రూ.లక్ష ఖర్చు అవుతోంది. ఈక్రమంలో ఈ మొత్తాన్ని వ్యక్తులు, సంఘాలు లేదా కార్పొరేట్ సంస్థలు విరాళాలు అందించవచ్చు. ఎస్వీ ఆపన్న హృదయ పథకానికి రూ.లక్ష విరాళం ఇస్తే మరుసటి రోజున ఐదుగురు భక్తులకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు. రూ.లక్ష విరాళంతోపాటు టికెట్ ధర రూ.2,500 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అవుతున్న క్రమంలో చాలా మంది భక్తుల దృష్టి ఈ ట్రస్టుపై పడింది. పైగా, చిన్నపిల్లల చికిత్స కోసం కావడంతో భక్తులు ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.