TTD Parakamani Case: ‘పరకామణి’లో సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:45 AM
తిరుమల శ్రీవారి పరకామణిలో హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలపై టీటీడీ సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామన్న కోర్టు
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలపై టీటీడీ సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీచేస్తామని న్యాయస్ధానం పేర్కొంది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. పరకామణి చోరీ ఘటనపై ఇప్పటికే చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని గుర్తుచేశారు. ఇందులో వేర్వేరు అంశాలు ఇమిడి ఉన్నందున.. కేసుల నమోదుపై సుప్రీంకోర్టు తీర్పులను అధ్యయనం చేసి రావాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించారు. పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించిన నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఆలయ ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్‌అదాలత్ వద్ద ఏవీఎ్‌సవో వై.సతీ్‌షకుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు గతంలో సీఐడీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. పరకామణిలో సంస్కరణలపై తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని కోర్టు టీటీడీని ఆదేశించింది. శాశ్వత సంస్కరణల్లో భాగంగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించడం, విలువైన లోహాలు, రాళ్లను వేరు చేసేందుకు ఏఐ, అత్యాధునిక సాంకేతికత వ్యవస్థ ఏర్పాటు విషయంలో 8 వారాల్లోపు ముసాయిదా రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు రాగా.. టీటీడీ తరఫున న్యాయవాది శ్రీనివాసబాబా వాదనలు వినిపించారు.