టీటీడీకి అధికారులు కావలెను!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:15 AM
టీటీడీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పోస్టుల్లో కింది స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
కీలక పోస్టులు ఖాళీ
మరికొన్ని బాధ్యతలు కింది స్థాయి సిబ్బందికి
పలు విభాగాల్లో పెరిగిన పనిభారం
నత్తనడకన అభివృద్ధి పనులు
తిరుపతి(టీటీడీ), జూన్ 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పోస్టుల్లో కింది స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పలు విభాగాల్లో పనిభారం పెరిగింది. ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలిస్తే .. ఏటా రూ.475 కోట్ల మేర పనులు చేపడతారు. రెండు నెలల క్రితం ఈ విభాగానికి చెందిన ఐదుగురు అధికారులు పనిభారం తట్టుకోలేక వీఆర్‌ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్‌ఈ-1, ఎస్‌ఈ-2. ఎస్‌ఈ-3 పోస్టులకు సంబంధించి ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. గత రెండేళ్లలో అనేక పనులకు బోర్డు ఆమోదముద్ర వేసినా పలు చోట్ల పనులే ప్రారంభమే కాలేదు. సీఎం చంద్రబాబు సూచనతో ఐటీ విభాగం కమాండ్ కంట్రోల్‌ను బలోపేతం చేసినా భవిష్యత్‌లో మరింత పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో డిప్యూటీ జీఎంగా ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ ఈఈకి ఈడీపీ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏఈవోను కీలకమైన పోస్టింగ్‌లో నియమించారు. దీంతో పనులు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి.
ప్రాజెక్టులకు నాథుడేరీ?
ఎస్వీబీసీ చానల్‌కు సీఈవో లేరు. తిరుపతి జేఈవో ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వం నియమించాల్సిన చైర్మన్, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయలేదు. పబ్లికేషన్స్ విభాగంలోనూ ఖాళీలున్నాయి. ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి పోస్టులోనూ పూర్తిస్థాయి అధికారి లేరు. శ్రీవేంకటేశ్వర రికార్డింగ్, దాస సాహిత్య.. ఇలా పలు ప్రాజెక్టులకు అధికారులు కరువయ్యారు. విద్యా విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ. వీరిని రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించినా అమలు చేయలేదు. మరికొంత మంది పదోన్నతులూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి లోటుపాట్లను సరిచేయకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా టీటీడీ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.
కీలక విభాగాల్లో పనిఒత్తిడి
తిరుమలలో గదుల కేటాయింపు ఎంతో కీలకం. ఇక్కడ ముగ్గురు డిప్యూటీ ఈవోలు ఉండాలి. కానీ ఆర్1, ఆర్2, ఆర్3లను ఒక్కరే చూసుకుంటున్నారు. వీఐపీ తాకిడి ఉండే ఆర్1కు ఒక డిప్యూటీ ఈవో తప్పనిసరిగా ఉండాలి. కానీ సిబ్బంది కొరతతో ఒక్కరికే అన్ని బాధ్యతలు కట్టబెట్టారు. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌లోని ఆలయాల్లో డిప్యూటీ ఈవోల స్థానంలో ఏఈవోలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన శ్రీవారి ఆలయానికి సూపరింటెండెంట్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. కన్యాకుమారి, జమ్ము, ఒడిశా ప్రాంతాల్లోనూ సిబ్బంది లేక కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు కట్టబెట్టారు. తిరుమల కల్యాణకట్టకూ డిప్యూటీ ఈవో లేరు. ఏఈవోకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించి నడిపిస్తున్నారు. అన్నప్రసాదాలకు సరుకుల సేకరణ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.