Share News

శ్రీవాణి టికెట్లపై అపోహలు వద్దు

ABN , Publish Date - May 14 , 2026 | 04:50 AM

ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని టీటీడీ బుధవారం..

శ్రీవాణి టికెట్లపై అపోహలు వద్దు

  • వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేయడం సాధ్యం కాదు: టీటీడీ

తిరుమల, మే 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని టీటీడీ బుధవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. ‘టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి భక్తులు మధ్యవర్తుల ద్వారా కూడా టికెట్లు బుక్‌ చేసుకునేవారు. అందులోని లోటుపాట్లను, భక్తుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 జూన్‌ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ల బుకింగ్‌ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్‌ బుకింగ్‌ సైట్‌ను హ్యాక్‌ చేయడం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అయితే కొందరు దళారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్‌, ఆటో కాపీయింగ్‌ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలను గుర్తించి సంబంధిత ఐడీలు, అక్రమ బుకింగ్‌ విధానాలను నిరోధించి తదనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తున్నాం. అలాగే నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్‌, అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని, దళారు ల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ టీటీడీ పేర్కొంది.

Updated Date - May 14 , 2026 | 04:50 AM