ప్రసాదాల నాణ్యతే లక్ష్యం
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:01 AM
శ్రీవారి ప్రసాదాల తయారీ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రిసెర్చ్....
పలు సంస్థలతో టీటీడీ అవగాహన ఒప్పందం
తిరుపతి(టీటీడీ), జూన్ 15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ప్రసాదాల తయారీ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)-సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్‌ఐ)మైసూర్ మధ్య సోమవారం బెంగళూరులో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆహార పదార్థాల్లో నాణ్యత, పోషక విలువలు మెరుగుపరచనున్నారు.
ఒప్పందంలో ముఖ్యాంశాలు..
ముడి పదార్థాల కొనుగోలు, ఆహార తయారీ, పంపిణీ ప్రక్రియల్లో నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలను టీటీడీ-సీఎఫ్టీఆర్‌ఐ బృందాలు రూపొందించి, అమలు చేస్తాయి.
ఫ నిల్వ, నాణ్యత పరీక్షలు, ముడి పదార్థాల కొనుగోలు వ్యవస్థల ఆధునికీకరణకు సీఎ్‌ఫటీఆర్‌ఐ సాంకేతిక సలహాలు అందిస్తుంది. కలుషిత ప్రమాదాలను తగ్గించి, నాణ్యతలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.
ప్రసాదాల అసలైన రుచి, నాణ్యత, సాంస్కృతిక విలువలకు భంగం కలుగకుండా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు పరిశోధన ఆధారిత ప్యాకేజింగ్ విధానాలు అభివృద్ధి చేస్తారు.
టీటీడీ ఆహార విశ్లేషకులు, ఆహార నిర్వహణ సిబ్బందికి ఆధునిక విశ్లేషణ పద్ధతులు, నమూనాల సేకరణ విధానాలు, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత పరీక్షలు, సుగంధ లక్షణాల విశ్లేషణపై శిక్షణ ఇస్తారు.
సీఎఫ్టీఆర్‌ఐకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ ఆహార తయారీ నిల్వ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ అధ్యయనాలు, నిల్వ/కొనుగోలు ప్రణాళికల మెరుగుదలకు మార్గనిర్దేశం చేస్తారు.