దాతల సదుపాయాల్లో మార్పులు
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:46 AM
తిరుమలలో సామాన్య భక్తులకు మరింత దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలిచ్చే దాతలకు కల్పిస్తున్న సదుపాయాల్లో టీటీడీ మార్పులు చేపట్టింది.
తిరుమలలో నేటి నుంచి నూతన విధానం అమలు
ఇప్పటికే విరాళాలు ఇచ్చిన వారికి... పాత సదుపాయాలు కొనసాగింపు
వచ్చే ఏడాదికి 10 లక్షల శ్రీవారి డైరీలు,
14.25 లక్షల క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం
ఎస్వీ మ్యూజియం సందర్శన రుసుం రూ.50
టీటీడీ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు
తిరుమల/తిరుపతి(టీటీడీ), జూలై 14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సామాన్య భక్తులకు మరింత దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలిచ్చే దాతలకు కల్పిస్తున్న సదుపాయాల్లో టీటీడీ మార్పులు చేపట్టింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. బోర్డు నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకతతో పాటు ఏకరీతిని తీసుకురావడానికి నూతన పాలసీని తయారు చేశామని, మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే విరాళాలిచ్చిన దాతలకు పాత సదుపాయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదికి శ్రీవారి డైరీలు 10లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 75వేలు ముద్రించేందుకు ఆమోదించాన్నారు. ఎస్వీ మ్యూజియం సందర్శకుల్లో 12ఏళ్లు పైబడిన వారికి రూ.50 ప్రవేశ రుసుం విధించడంతో పాటు మ్యూజియం నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని టాటా సంస్థను కోరాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు.
దాతల సదుపాయాల్లో మార్పులివే...
వ్యక్తిగతంగా విరాళాలిచ్చే దాతలకు సంబంధించి రూ.లక్ష విరాళం ఇచ్చేవారికి ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.2లక్షలు ఇచ్చేవారికి ఒకసారి సుపథం, రూ.3.లక్షలు ఇస్తే ఒకసారి ఎస్‌ఈడీ, ఒకసారి సుపథం, రూ.4లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, రూ.5లక్షలు ఇచ్చేవారికి 3సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు. రూ.10 లక్షలు విరాళంగా ఇస్తే ఒకసారి సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.15లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్, 20లక్షలు ఇచ్చేవారికి 3సార్లు సుపథం, రెండుసార్లు వీఐపీ బ్రేక్, రూ.25 లక్షలు విరాళానికి మూడుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇక రూ.50 లక్షలు విరాళంగా ఇస్తే ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు రెండు కల్యాణోత్సవాలు, ఒకసారి సుప్రభాతంలో పాల్లొనే అవకాశం కల్పిస్తారు. ఇక రూ.75 లక్షలు ఇచ్చేవారికి ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు ఒక కల్యాణోత్సవం, ఒకసారి సుప్రభాతంలో పాల్గొనవచ్చు. అలాగే రూ.కోటి విరాళం ఇస్తే నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, మూడుసార్లు కల్యాణోత్సవాలకు అనుమతిస్తారు. ఇక రూ.1.50కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా నాలుగుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, ఐదుసార్లు కల్యాణోత్సవాలకు హాజరుకావచ్చు.
కంపెనీ, ట్రస్టు, ఫర్మ్ దాతలకు...
ఈ విభాగంలో దాతలకు సంబంధించి రూ.లక్ష విరాళం ఇచ్చేవారికి ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.2లక్షలు ఇచ్చే దాతలకు ఒకసారి సుపథం, రూ.3.లక్షలు ఇస్తే రెండుసార్లు, రూ.4 లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, ఒకసారి ఎస్‌ఈడీ, రూ.5లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, ఎస్‌ఈడీ కల్పిస్తారు. రూ.15లక్షలు ఇస్తే ఒకసారి సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్, రూ.20 లక్షలు ఇచ్చేవారికి ఒక్కోసారి చొప్పున సుపథం, ఒక ఎస్‌ఈడీ, 2వీఐపీ బ్రేక్, రూ.25 లక్షలు విరాళం ఇస్తే 2సార్లు సుపథం, 1ఎస్‌ఈడీ, 3వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. ఇక రూ.50 లక్షలు విరాళంగా ఇస్తే 4 సుపథం, 2 వీఐపీ బ్రేక్, 1 సుప్రభాత సేవ, 2 కల్యాణోత్సవాలకు అవకాశం ఉంటుంది. ఇక రూ.75 లక్షలు ఇచ్చేవారికి ఏటా 4సుపథం, 2వీఐపీ బ్రేక్, 2 సుప్రభాత సేవ, 2 కల్యాణోత్సవాలు, రూ.కోటి ఇస్తే నాలుగు సార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు రెండుసార్లు సుప్రభాత సేవకు, 3 కల్యాణోత్సవాలకు అవకాశం కల్పిస్తారు. అలాగే రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా నాలుగు సార్లు సుపథం, ఐదుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు నాలుగుసార్లు సుప్రభాత సేవ, ఐదు కల్యాణోత్సవాలకు హాజరుకావచ్చు.
‘నిత్య హారతుల’పై డీకేకు అవగాహన లేదు: చైర్మన్
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ‘నిత్య హారతుల’పై కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు అవగాహన లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. నిత్య హారతుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తామంటూ డీకే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ, ‘డీకే చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. ఆయనకు అవగాహన లేకుండా ఆ వ్యాఖ్యలు చేసినట్టుంది. ఇక్కడ పరిస్థితులను వివరిస్తూ ఆయనకు టీటీడీ నుంచి రీజాయిండర్ పంపిస్తాం. తెలియక మాట్లాడారని అనుకుంటున్నాం’ అన్నారు.