Share News

నాసిరకమే!

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:17 AM

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగమే కాదు.. చివరకు శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలోనూ నాసిరకం దినుసులు ఉపయోగించారు...

నాసిరకమే!

  • శ్రీవారి నైవేద్య దినుసులూ

  • వైసీపీ హయాంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో వినియోగం

  • నాణ్యతపై పోటు సిబ్బంది చెప్పినా.. పట్టించుకోని నాటి పాలకులు, అధికారులు

  • కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరాదారుల సమక్షంలో పరీక్షలు

  • ఆయా పదార్థాల్లో మలినాలు ఉన్నాయని నివేదికలో నిర్ధారణ

తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగమే కాదు.. చివరకు శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలోనూ నాసిరకం దినుసులు ఉపయోగించారు. సేంద్రియ పంట ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని దినుసులు, పదార్థాలను అన్నప్రసాదాల తయారీలో వాడారు. అయితే వాటితో ప్రసాదాల తయారీ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదో రకమైన వాసన వస్తోందని పోటు సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కమిటీ వేసి, సరఫరాదారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. ఆయా పదార్థాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి.. 2024 సెప్టెంబరు నుంచి తిరిగి సాధారణ పదార్థాల ద్వారానే శ్రీవారికి నైవేద్యం తయారు చేస్తున్నారు.

2021 ముందు వరకు సాధారణంగానే..

శ్రీవారికి నిత్యం వివిధ రకాల అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. 2021 ముందు వరకు రైతులు సాధారణంగా పండించే పదార్థాలనే వినియోగిస్తూ వచ్చారు. అయితే యుగ తులసి గోసేవా ఫౌండేషన్‌ చైర్మన్‌, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్‌ విజ్ఞప్తి మేరకు సేంద్రియ ఉత్పత్తులను ప్రసాదంగా నివేదించేందుకు అప్పటి అధికారులు నిర్ణయించారు. రైతుల నుంచి సేకరించేందుకు కమిటీ వేయాలని 2021 జూన్‌ 19న పాలకమండలి లో నిర్ణయించారు. యుగ తులసి గో సేవా ఫౌండేషన్‌ తొలుత ఒక నెల బియ్యం, నెయ్యి, బెల్లం సరఫరా చేసింది. ఆ తర్వాత సేవా (సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌) సంస్థ ద్వారా దినుసులు, పదార్థాలు సేకరించి టీటీడీకి అందించారు. ప్రసాదాల తయారీకి అవసరమైన వస్తువులను ఇచ్చేందుకు సిద్ధమని అమలాపురం ప్రాంతానికి చెందిన శ్రీ శ్రీనివాస సేవా ట్రస్టు సంస్థ 2021 అక్టోబరు 29న టీటీడీకి లేఖ రాసింది. ఇందుకు బదులుగా రూ.10 లక్షలు విరాళంగా చెల్లించిన దాతలకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు తమకు కల్పించాలని ట్రస్టు ప్రతినిధులు కోరారు. దీనిపై చర్చించిన నాటి బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే ఆయా సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినా పక్కనబెట్టింది.


వండుతున్నప్పుడు అదో వాసన

సేంద్రియ పదార్థాల ద్వారా ప్రసాదం తయారీలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాసన అదో రకంగా వస్తోందని పోటు సిబ్బంది చెప్పినా నాటి పాలకమండలి, అధికారులు పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 22న అధికారులకు ఒక వినతిపత్రం అందించారు. సేంద్రియ ఉత్పత్తుల నాణ్యత బాగా లేదని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా ప్రసాదం తయారు చేయడం వల్ల టీటీడీకి అప్రతిష్ట వస్తుందని స్పష్టం చేశారు. సేంద్రియ పదార్థాల ద్వారా ప్రసాదాల తయారీ సరికాదని ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులు ఆక్షేపించారు.

ఆరోపణలపై కమిటీ.. పరీక్షలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతపై సమగ్ర విచారణకు టీటీడీ ఉన్నతాధికారులు 2024 సెప్టెంబరు 5న కమిటీని నియమించారు. ప్రసాదాల తయారీకి నెయ్యి, బియ్యం, బెల్లం ఇతర సరుకులకు సరఫరాదారుల సమక్షంలోనే 2024 సెప్టెంబరు 6న ఎస్వీ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ సైన్స్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఈ పదార్థాల్లో గణనీయమైన శాతంలో మలినాలున్నట్లు 2024 సెప్టెంబరు 17న ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో 2024 సెప్టెంబరు నుంచి తిరిగి సాధారణ పదార్థాల ద్వారానే శ్రీవారికి నైవేద్యం తయారు చేస్తూ వచ్చారు.

నాడు భక్తులకు సరిగా అందని నైవేద్యం

వైసీపీ హయాంలో సేంద్రియ పదార్థాలు సరిపడా అందుబాటులో లేకపోవడంతో నాడు నిత్యకట్ల ప్రసాదాలు మాత్రమే తయారు చేశారు. రోజూ 29 నుంచి 32 అర సోల గంగాళాలు, గురువారం మాత్రం 91 సోలాల గంగాళాల్లో ప్రసాదాలను తయారు చేశారు. వీటి వల్ల గురువారం 25,250, ఇతర రోజుల్లో 7,250 మంది భక్తులకు మాత్రమే ఆలయం లోపల ప్రసాదాలందేవి. ఇప్పుడు అదనంగా 64 అర సోల గంగాళాల్లో ప్రసాదం తయారీ వల్ల గురువారం 42,500, ఇతర రోజుల్లో 24,750 మంది భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 04:17 AM