నాణ్యమైన లడ్డూలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:43 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై (2024కు ముందు) భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు: టీటీడీ
క్వాలిటీ దెబ్బతినకుండా నిబంధనల్లో మార్పులు
టెండరు దక్కించుకున్న సంస్థలు నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి
ఎన్‌డీడీబీ నిపుణులు సూచించిన ఆవు నెయ్యి ధర పరిగణనలోకి
టెండరు కేటాయింపుల్లోనూ పారదర్శకత
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం: టీటీడీ
అడ్డగోలు ఆరోపణలపై వాస్తవాలతో సవివర ప్రకటన
తిరుపతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై (2024కు ముందు) భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనల్లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. టెండరు దక్కించుకున్న డెయిరీ సంస్థలు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ, ఎన్‌డీడీబీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది. ఆవు నెయ్యి విషయంలో ఎన్‌డీడీబీ నిపుణులు సూచించిన ధరను పరిగణనలోకి తీసుకొన్నామని, టెండరు కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరిగాయని వివరించింది. శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడటానికి టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. టీటీడీ ప్రకటనలో ముఖ్యాంశాలివీ..
ఆరోపణలు- వాస్తవాలు...
ఆరోపణ: నందిని డెయిరీ (కేఎంఎఫ్)ని తప్పించారు.
వాస్తవం: 2024 నుంచి నందిని డెయిరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదు. మొత్తం ఏడు టెండర్లలో 4 నందినీ డెయిరీకి దక్కాయి. ప్రస్తుతం అవసరమైన నెయ్యిలో 62 శాతం ఈ సంస్థ సరఫరా చేస్తోంది. 2019-24 మధ్య నందిని డెయిరీకి ఎటువంటి టెండర్లు ఇవ్వలేదు.
11-2024 బోర్డు రిజల్యూషన్ నం.16 - 10 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.495 లెక్కన సరఫరా)
01-2025 బోర్డు రిజల్యూషన్ నం.182 - 20 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.513 లెక్కన సరఫరా)
05-2025 బోర్డు రిజల్యూషన్ నం.292 - 10 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.600 లెక్కన సరఫరా)
10-2025 బోర్డు రిజల్యూషన్ నం.484 - 20 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.716.92 లెక్కన సరఫరా. ఇందులో 10 లక్షల కిలోలు మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది.)
ఆరోపణ: ఇందాపూర్ డెయిరీకి మాత్రమే టెండరు ఇచ్చారు.
వాస్తవం: ఇందాపూర్ డెయిరీకి మాత్రమే టెండరు ఇచ్చారనేది అవాస్తవం. ఏడు టెండర్లలో ఈ సంస్థ కేవలం రెండు మాత్రమే దక్కించుకుంది. మొత్తం 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ముందుకొచ్చింది.
12-2025 బోర్డు రిజల్యూషన్ నం.590 - 6.5 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.658 లెక్కన సరఫరా)
12-2025 బోర్డు రిజల్యూషన్ నం.605 - 3.5 లక్షల కిలోలు (ఒక్కో కేజీ రూ.657 లెక్కన సరఫరా)
ఆరోపణ: ఇతర డెయిరీ సంస్థలకు అవకాశం ఇవ్వలేదు.
వాస్తవం: టెండర్లలో మొత్తం ఏడు డెయిరీలు పాల్గొన్నాయి. వీటిలో నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డెయిరీ, సంగం, ఇందాపూర్ డెయిరీలకు నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చాం.
ఆరోపణ: రేట్లు పెంచి ఆర్డర్ ఇచ్చారు.
వాస్తవం: 2016లో ఆవు పాల ధర లీటరు రూ.17 నుంచి 20 మధ్య ఉండేది. అప్పుడు ఆవు నెయ్యి ధర రూ.278 ఉంది. ప్రస్తుతం ఆవు పాల ధర రూ.42 (సుమారు 147ు పెరిగింది). ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా దీనికి అనుగుణంగా ఇప్పుడు రూ.658 (సుమారు 137ు పెరిగింది) ఉంది. ఇతర డెయిరీ సంస్థలు సైతం ఇంచుమించు ఎక్కువ ధరలకే కోట్ చేశాయి.
ఆరోపణ: కమీషన్ల కోసం రేటు పెంచారు.
వాస్తవం: సగటు ఎన్‌సీడీఎ్‌ఫఐ ఆవు వెన్న ధర, దేశవ్యాప్త ఆవు నెయ్యి హోల్‌సేల్ మార్కెట్ (ఎన్‌సీడీఎ్‌ఫఐ అండ్ ఐడీఏ) పరిస్థితులను పరిశీలించాం. ఎన్‌డీడీబీ నిపుణులు సూచించే ధరలను పరిగణనలోకి తీసుకున్నాం. అందువల్ల ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.
ఆరోపణ: పరిధి మీరి కట్టబెట్టారు.
వాస్తవం: పెరిగిన ధరల వల్ల బోర్డు రిజల్యూషన్ నం. 484 మేరకు 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని నందిని డెయిరీ చెప్పింది. ఇందులో కేవలం 10 లక్షల కిలోలు మాత్రమే సరఫరా చేస్తామని తెలిపింది. నెయ్యి సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రవాణా పరిధిని దాటి ఎల్-2గా నిలిచిన జాతీయ స్థాయి డెయిరీలకు అవకాశం ఇచ్చాం.
ఆరోపణ: 2019-24 మధ్య ఇందాపూర్ డెయిరీ టెండర్లలో పాల్గొనలేదు.
వాస్తవం: 2019-24 మధ్య ఇందాపూర్ డెయిరీ ఆరు సార్లు టెండర్లలో పాల్గొంది.
నిబంధనల్లో మార్పులు
గతంలో ఉన్న 1,500 కి.మీ. సేకరణ పరిధిని 800 కి.మీ.కు తగ్గించాం.
నెయ్యి రవాణా చేసే ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్ ఏర్పాటు తప్పనిసరి చేశాం.
డెయిరీ ప్రాసెసర్ల తయారీ సిద్ధతను అంచనా వేసేందుకు ఎంఆర్‌ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని ప్రవేశపెట్టాం.
ఎఫ్‌ఎస్ఎస్ఆర్ 2.1.8 నిబంధనలతో పాటు మిల్ ఫ్యాట్ ప్యూరిటీ పరీక్షలను (ఐఎ్‌సవో 17678:2019), సెన్సరీ పారామీటర్స్ (ఐఎస్ కోడ్: 7770:1975) కఠినతరం చేశాం.
నెయ్యి సరఫరా చేసే సంస్థల గుత్తాధిపత్యానికి తావివ్వకుండా 2024-25 మధ్య ఏడు విడతలుగా టెండర్లు నిర్వహించాం. పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు చేపట్టాం. ఈ ప్రక్రియలో నందిని(కేఎంఎఫ్) నాలుగు, మదర్ డెయిరీ రెండు, ఇందాపూర్ డెయిరీ రెండు, సంగం డెయిరీ ఒక టెండరు చొప్పున దక్కించుకున్నాయి. ప్రీమియర్ అగ్రి డెయిరీ, కొల్హాపూర్ డెయిరీ (గోకుల్), గోవింద్ మిల్క్ సంస్థలకు టెండరు దక్కలేదు.