Share News

తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:22 AM

తిరుమల శ్రీవారి ఆలయానికి నలు దిక్కులా ఉన్న మాడవీధులకు నాలుగు వేదాల పేర్లను టీటీడీ ఖరారు చేసింది. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధి యజుర్వేద మార్గం, పడమర మాడవీధిని....

తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు

  • ప్రధాన కూడళ్లు, రోడ్లకు పురాణ పురుషులు, భక్తాగ్రేసరులు, ఆళ్వార్ల పేరిట నామకరణం

  • కమిటీ సిఫారసులతో 38 పేర్లు ఖరారు చేసిన టీటీడీ

తిరుమల, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయానికి నలు దిక్కులా ఉన్న మాడవీధులకు నాలుగు వేదాల పేర్లను టీటీడీ ఖరారు చేసింది. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధి యజుర్వేద మార్గం, పడమర మాడవీధిని సామవేద మార్గం, ఉత్తర మాడవీధిని ఆధర్వణవేద మార్గంగా నామకరణం చేయాలని నిర్ణయించింది. భక్తులకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా తిరుమలలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ముఖ్యమైన ప్రాంతాలకు పురాణ పురుషులు, ఆళ్వార్లు, స్వామి భక్తులైన తాళ్లపాక అన్నమాచార్యులు, పురంధరదాసు, ఆలయ నిర్మాణానికి సేవలందించిన రాజులు, రాణుల పేర్లను పెట్టేందుకు ఇటీవల బోర్డు తీర్మానం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చక్రవర్తి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ మేడసాని మోహన్‌, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తితో కమిటీని ఏర్పాటు చేసింది. వీరు ప్రాంతానికి అనుగుణంగా 38 పేర్లను సిఫారసు చేశారు. వాటితో పాటు శ్రీవారి భక్తుడు శరభయ్య పేరును కూడా ఒక రహదారికి పెట్టాలని బోర్డు సూచన చేసింది.

కమిటీ ఎంపిక చేసిన పేర్లు ఇవీ...

  • జీఎన్సీ సర్కిల్‌ నుంచి లేపాక్షి సర్కిల్‌ వరకు: గరుడాద్రి మార్గం

  • జీఎన్సీ సర్కిల్‌ నుంచి నారాయణగిరి సర్కిల్‌ వరకు రింగ్‌రోడ్డుకు: తిరువేంకట పథం

  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (లేపాక్షి సర్కిల్‌ నుంచి రాంభగీచ, నందకం, మేదరమిట్ట, ఎస్వీ మ్యూజియం, నారాయణగిరి, గోకులం, ఎస్‌ఎంసీ సర్కిల్‌): అన్నమాచార్య మార్గం

  • జీఎన్సీ సర్కిల్‌ నుంచి ఎస్‌ఎంసీ సర్కిల్‌, అన్నమయ్య భవనం, అశ్విని ఆస్పత్రి వరకు: ఆంజనాద్రి మార్గం

  • పద్మావతి విచారణ కార్యాలయం నుంచి పద్మావతి అతిథిగృహం వరకు: పద్మావతి మార్గం

  • బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఎంప్లాయీస్‌ క్యాంటీన్‌ వరకు: కులశేఖరాళ్వార్ల మార్గం

  • రాంభగీచ సర్కిల్‌ నుంచి స్టాఫ్‌ క్వార్టర్స్‌ వరకు: జయవిజయ మార్గం

  • నందకం సర్కిల్‌ నుంచి గోగర్భం డ్యాం సర్కిల్‌: నిత్యకల్యాణ మార్గం

  • వరాహస్వామి విశ్రాంతి గృహం సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు: శరణాగతి మార్గం

  • పిండిమర సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు: ఆకాశగంగ మార్గం


  • శంకరమఠం నుంచి శిలాతోరణం సర్కిల్‌: వేదవ్యాస మార్గం

  • లేపాక్షి సర్కిల్‌ నుంచి ఆస్థాన మండపం: అశ్వత్థనారాయణ మార్గం

  • అప్రోచ్‌ రోడ్డు నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం వరకు: శేషాచల మార్గం

  • రాంభగీచ సర్కిల్‌ నుంచి పుష్కరిణి: శ్రీకృష్ణదేవరాయ మార్గం

  • అప్రోచ్‌ రోడ్డు నుంచి వరాహస్వామి ఆలయం: ఆదివరాహ మార్గం

  • వరాహస్వామి విశాంత్రి గృహం సర్కిల్‌ నుంచి ఉత్తర మాడవీధికి: లక్ష్మీ హయగ్రీవ మార్గం

  • పిండిమర నుంచి హయగ్రీవ ఆలయం వరకు: తరిగొండ వెంగమాంబ మార్గం

  • ఎస్వీ మ్యూజియం నుంచి పడమర మాడవీధి: గోపీనాథ దీక్షిత మార్గం

  • గోకులం సర్కిల్‌ నుంచి వైకుంఠం-2: గోకులం మార్గం

  • నారాయణగిరి సర్కిల్‌ నుంచి ఎండీసీ మీదుగా ఉచిత దర్శన కాంప్లెక్స్‌: శ్రీమన్నారాయణ మార్గం

  • ఏటీసీ సర్కిల్‌ నుంచి పీఏసీ-5: హథీరాం బావాజీ మార్గం

  • శ్రీవారి మెట్టు: శ్రీవారి మార్గం

  • జీఎన్సీ ఔటర్‌ రింగురోడ్డు నుంచి హెచ్‌వీసీ: నీలాదేవి మార్గం

  • జీఎన్సీ సర్కిల్‌ లేపాక్షి సర్కిల్‌ (నడక మార్గం): నమ్మాళ్వార్‌ మార్గం

  • బేడి ఆంజనేయస్వామి ప్రాంగణం: సాలువ నరసింహరాయుల ప్రాంగణం

  • ఆలయం ముందున్న ఖాళీ స్థలం: భగవద్రామానుజాచార్య ప్రాంగణం

  • కదిలే వంతెన నుంచి సుపథం వరకు: తిరుమలనంబి ప్రాంగణం

  • శ్రీవారి ఆలయ వెనుకభాగం: అనంతాళ్వార్‌ ప్రాంగణం

  • లేపాక్షి సర్కిల్‌: అన్నమయ్య కూడలి

  • ఎస్‌ఎంసీ సర్కిల్‌: పురంధరదాసు కూడలి

  • రాంభగీచ సర్కిల్‌: తొండమాన్‌ చక్రవర్తి కూడలి

  • నందకం విశ్రాంతి భవనం సర్కిల్‌: వకుళమాత కూడలి

  • జీఎన్సీ సర్కిల్‌: గరుడాద్రి కూడలి

  • వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -2 సర్కిల్‌: తిరుమల రాయల కూడలి

Updated Date - Jun 06 , 2026 | 05:22 AM