Share News

సమూల ప్రక్షాళన!

ABN , Publish Date - May 03 , 2026 | 04:06 AM

వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు ఆయన మాటను ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

సమూల ప్రక్షాళన!

  • టీటీడీ పాలనను పునర్వ్యవస్థీకరించాలి

  • బోర్డుల లాభాపేక్షతోనే సర్వభ్రష్టత్వం

  • భక్తిభావం లేని స్వార్థపరులతోనే తలనొప్పులు

  • డబ్బుపై ఆశ లేని స్వామి భక్తులకే చోటుండాలి

  • పూర్తికాలం రాజకీయ నేతలతోనే అసలు సమస్య

  • కీలక విభాగాలకు నిపుణులే అధికారులుగా ఉండాలి

  • కొనుగోలు, నియంత్రణ, పర్యవేక్షణపై పూర్తి నిఘా

  • బలమైన ఫిర్యాదులు, పరిష్కార వ్యవస్థ ఏర్పాటు

  • ఆర్థిక సలహాదారు, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లను బయట నుంచి పంపించాలి

  • సర్కారుకు కమిటీల సిఫారసుల సారమిదే..

అఖిలాండకోటి నాయకుడు తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలేమిటో తెలిసిపోయింది. భక్తిభావం ఉండాల్సినచోట... స్వలాభం, స్వార్థం, ఆశ్రిత పక్షపాతం తాండవిస్తూ ఆలయ ఆచారాలను మంటగలుపుతున్నాయని నిర్ధారణ అయింది. తిరుమలేశుడి పాదపద్మాల చెంత భక్తిభావంతో పనిచేస్తూ, ధర్మకర్తలుగా నిస్వార్థంగా మెలగాల్సిన వారు, ఫక్తు స్వార్థపరులుగా వ్యవహరిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఎవరెన్ని తప్పులుచేసినా, వాటిని కనిపెడుతూ, ధర్మం దారిలోనే నడవాల్సిన అధికార వ్యవస్థ సైతం సర్వభ్రష్టత్వం చెందిందని విచారణ నివేదికలు ఘోషిస్తున్నాయి. అంటే, తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాలను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందని ఈ పరిణామాలు విస్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. దేవ దేవుడి చెంత ధర్మం దారి తప్పకుండా, భక్తిభావం ముసుగులో అరాచకాలు రాజ్యమేలకుండా, బోర్డు, అధికారవ్యవస్థ దారి తప్పకుండా సమూల మార్పులు తీసుకు రావాల్సిన సమయం ఇంతకుమించి మరొకటి లేదని నిన్నటి సీబీఐ సిట్‌ రిపోర్టు, తాజాగా రిటైర్డు సీఎస్‌ దినేశ్‌కుమార్‌ ఏకసభ్య కమిషన్‌ నివేదిక స్పష్టం చేస్తున్నాయి.

ప్రక్షాళన-1

  • పెద్దలతోనే ప్రారంభించాలి

వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు ఆయన మాటను ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దివంగత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో సేవాభావం ఉన్నవారు, దేవుడంటే అమితమైన భక్తి విశ్వాసాలుండి డబ్బుపై ఆశలేనివారిని బోర్డు సభ్యులుగా నియమించేవారు. అలాంటి వారిలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, భానుమతి వంటివారు అప్పట్లో బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు దేవుడి సేవ తప్ప సొంత లాభం చూసుకోలేదు.


కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దేవుడి సేవకన్నా సొంత పార్టీ మనుషులు, వ్యాపార భాగస్వాములు, బంధువులు, కాంట్రాక్టర్లు, పూర్తికాలం రాజకీయాల్లో ఉన్న నేతలను బోర్డు చైర్మన్‌గా, సభ్యులుగా నియమిస్తూ వస్తున్నారు. దీని వల్ల భూమిపై ఉన్న సకల రాజకీయాలు, స్వార్థం, దురాశ, బంధుప్రీతి వంటివి ఏడుకొండలదాకా చేరిపోయాయి. ఇది రానురాను మరీ ఎక్కువైంది. జగన్‌ ప్రభుత్వంలో పరాకాష్ఠకు చేరింది. జగన్‌ ఏకంగా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఆయన తన నమ్మినబంటు అప్నన్నను వెంట పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత టీటీడీలో ఏం జరిగిందో, అప్నన్న ఏమేం పనులు చేశారో, కల్తీనెయ్యి సరఫరాలో ఎలాంటి వ్యవహారాలు సాగించారో సీబీఐ సిట్‌ స్పష్టంగా చెప్పింది. ఈ నేపఽథ్యంలో ధర్మకర్తగా వ్యవహరించే పాలకమండలి ఛైర్మన్‌, సభ్యులు ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదో మరోసారి సర్కారు పున ర్‌ నిర్వచించాల్సిన అవసరం ఉంది. అంటే, చట్టంలోనే స్పష్టమైన సవరణలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నా రు. పూర్తికాలం రాజకీయ నాయకులు, తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నవారు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, నాస్తికులు, ఏమాత్రం భక్తిభావం, సేవాభావం లేని వ్యక్తులను కీలకమై న బోర్డు చైర్మన్‌, సభ్యులుగా నియమించకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆగమశాస్త్ర పండితులు, నిపుణులు కోరుతున్నారు. టీటీడీ ప్రక్షాళన అనేది పాలకమండలి నియామకంలో తీసుకొచ్చే సమూల మార్పులతోనే ఆరంభం కావాలని ఆ వర్గాలు సూచిస్తున్నాయి.


ప్రక్షాళన-2

ఈవో పదవికి పూర్వవైభవం

టీటీడీ పాలనలో పాలకమండలి తర్వాత అత్యంత కీలకమైన ది కార్యనిర్వాహక వ్యవస్థ. అంటే, ఈవో. ఈ పోస్టులో ఎవరుండాలి, ఆ తర్వాత పోస్టు అయిన జేఈవోగా ఎవరుండాలి, ఆడిటింగ్‌, కొనుగోలు, నాణ్యత ప్రమాణాల తనిఖీ, విజిలెన్స్‌, రక్షణ, భక్తుల సేవలు వంటి విభాగాన్నీ అంతిమంగా ఈవో నియంత్రణలోనే ఉంటాయి. 25 ఏళ్ల క్రితం వరకు టీటీడీ ఈవో అంటే గొప్ప పేరు ఉండేది. ఈవోగా పనిచేసిన అధికారికి ఎనలేని గౌరవం, మర్యాదలు ఉండేవి. కానీ, గత కొన్నేళ్లుగా టీటీడీలో ఈఓగా పనిచేసిన అధికారులు విమర్శలపాలవుతున్నారు. నేతల కొమ్ము కాస్తున్నారన్న అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నారు. ఈ విమర్శలు ఎక్కువయిన తర్వాత ప్రభుత్వాధినేతలు కూడా ముసుగు తొలగించి సొంత మనుషులనే తీసుకొచ్చి ఈవోలుగా నియమించుకున్నారు. వీరిలో ఒకరు నాటి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి. ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను జగన్‌ సర్కారు ఏరికోరి తీసుకొచ్చి తొలుత ఈవోగా నియమించాలని చూసింది. అది సాధ్యం కాకపోవడంతో తొలుత జేఈవో, ఆ తర్వాత ఆయనకు పదోన్నతులు ఇచ్చి ఈవోగా నియమించింది. ఆయన హయాంలో టీటీడీ ఎంతలా విమర్శలు, ఆరోపణల పాలయిందనేది జగద్వితమే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈవోగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి సింఘాల్‌పై ఒక్క చెడు రిమార్క్‌ కూడా రాలేదు. పైగా, టీటీడీని బలోపేతం చేసే చర్యలెన్నో తీసుకున్నారు. 2019లో నెయ్యి సరఫరా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రభు త్వం మారింది. జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌ అయ్యారు. వారి చర్యలను ఈవోగా ఆయన అడ్డుకోలేకపోయారు. తన చేతులతో కఠినతనం చేసిన నిబంధనలను తిరిగి వైవీ హయాంలో సులభతరం చేశారు. కల్తీనెయ్యి దర్జాగా టీటీడీకి చేరింది. ఒక ప్రభుత్వంలో ఒక్క రిమార్క్‌లేకుండా పనిచేసిన అధికారి, మరో ప్రభుత్వంలో ఇలా విమర్శల పాలెందుకయ్యారు? అక్కడ పనిచేసే అవకాశం వచ్చిన అధికారి రాజకీయ ఒత్తిళ్లు, ఇతర అంశాలకు తావివ్వకూడదు. దేవుడి సేవ దృష్టిలోనే ప్రతీ నిర్ణయం ఉండేలా పనితీరు ఉండాలి. అలాంటి అధికారులను ఏరికోరి ఈవోలుగా నియమించాలని నిపుణులు సూచిస్తున్నారు.


ప్రక్షాళన-3

బదిలీలు.. నిపుణుల భర్తీ

ప్రభుత్వంతో పోలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవస్థ చాలా చిన్నది. టీటీడీలో ఉద్యోగం పొందిన వారు అక్కడే పనిచేస్తారు. విభాగాలు మారుతాయి తప్ప ఇతర ప్రాంతాలకు బదిలీలు ఉండవు. కాబట్టి వారి పరిధి కూడా చిన్నదే. కాబట్టి అనేక విభాగాల్లో పనిచేస్తున్నవారు అక్కడే పుట్టి పెరిగినవారున్నారు. సర్వీసులో కొన్ని రకాల అబ్లిగేషన్‌లు వస్తుంటాయి. దాని వల్ల తప్పును తప్పుగా చెప్పలేని పరిస్థితులు వస్తున్నాయి. దీంతో అనేక అనర్థాలు జరిగిపోతున్నాయని సీబీఐ సిట్‌ అభిప్రాయపడింది. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులను 15 శాతం మేర బదిలీ రూపంలో టీటీడీలో పని చేయించాలని, టీటీడీలో పనిచేస్తున్న 15 శాతం మంది ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో పని చేయించేలా కొత్త విధానం తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే వారిలో 12 శాతం మందిని హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేయించే నిబంధన ఉంది. అలాగే, హెచ్‌వోడీల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీ ద్వారా సచివాలయంలో పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే విధానం టీటీడీలో తీసుకొస్తే ఉద్యోగుల్లో జవాబుదారీ కూడా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కీలకమైన ప్రొక్యూర్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఆడిటరింగ్‌, నాణ్యతా ప్రమాణాల తనిఖీ వంటి విభాగాలకు బయటినుంచి నిపుణులను తీసుకొచ్చి నియమించాలని సీబీఐ సిట్‌, దినేశ్‌కుమార్‌ సర్కారుకు సిఫారసు చేశారు. భక్తులు ఇచ్చే ప్రతీ రూపాయి జాగ్రత్తగా వాడాలి. దీనికోసం టీటీడీలో కొనుగోళ్లు, ఆడిటింగ్‌ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలి. ఇందుకు టీటీడీలోని వారు మాత్రమే సరిపోరని, బయటి నుంచి నిపుణులను పంపించాలని సీబీఐ సిట్‌ సిఫారసు చేసింది. టీటీడీ అకౌంట్స్‌, ఆడిటింగ్‌కు ఇప్పుడు నిపుణుల అవసరం ఉన్నదని దినేశ్‌కుమార్‌ కూడా స్పష్టం చేశారు. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లేదా కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఆర్థిక నిపుణులను అక్కడ అధికారిగా నియమించాలని సిఫారసు చేశారు.


ప్రక్షాళన-4

పాలనలో సమూల మార్పులు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన వ్యవహారాల్లో సమూల మార్పులు తీసుకురావాలని సిట్‌ సర్కారుకు సిఫారసు చేసింది. టీటీడీలో ఈ-నోట్‌ ప్రతిపాదనల అంశంపై సీరియ్‌సగా దృష్టిపెట్టాలి. కీలకమైన అంశాల్లో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లతోనే ఈ -నోట్‌ ప్రతిపాదనలు పెట్టిస్తున్నారు. అవి వివిధ స్థాయుల్లో పరిశీలనకు వెళ్తున్నాయి. వాటికి స్వతంత్ర పరిశీలన, హేతుబద్ధమైన కారణాలేవీ ఉండటం లేదు. సులువుగా ఎవరిస్థాయిలో వాళ్లు ఫైల్స్‌ ఫార్వార్డ్‌ చేస్తున్నారు. కనీసం బుర్రపెట్టి ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. జవాబుదారీ తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ప్రతీస్థాయిలో అధికారి విధులు, పాత్ర, జవాబుదారీ ఏమిటో స్పష్టంగా నిర్దేశించాలి. ఈ వ్యవహారంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకు రావాల్సిఉంది. కొనుగోలు విభాగం చాలా బలహీనంగా ఉంది. సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఈ విభాగాన్ని వెంటనే బలోపేతంచేయాలి. సిబ్బందిని పెంచాలని సిట్‌ సూచించింది.


ప్రక్షాళన-5

టెండర్‌ నిబంధనలు మార్చాలి

ఇప్పుడున్న కొనుగోలు నిబంధనలు కల్తీకి, నాణ్యత లేని సరుకుల సరఫరాకు ఆస్కారం కల్పించేలా ఉన్నాయని సిట్‌ తేల్చింది. కాబట్టి, తక్కువ ధరకు వచ్చే ప్రతీ సరుకును కొనాలన్న నిబంధనలను మార్చాలని సిఫారసు చేసింది. దినేశ్‌కుమార్‌ కమిటీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అతి తక్కువ ధర కోట్‌చేసిన బిడ్డర్‌నే ఎంపిక చేయాలన్న అంశం నెయ్యి, ఇతర నిత్యావసరాల కొనుగోళ్లకు వర్తించకూడదని, దాని వల్ల కల్తీ సరుకుల సరఫరాకు అవకాశం లభిస్తోందని ఆ కమిటీ స్పష్టం చేసింది. కొనుగోలు టెండర్‌ల నిబంధనలు కఠినతరంచేయాలని, స్పష్టం చేసింది. కల్తీనెయ్యి సరఫరాచేసిన కంపెనీలు టెండర్ల సమయంలో సమర్పించిన పత్రాలు, వాటి అర్హతను నిర్దేశించే డాక్యుమెంట్లను సరిగ్గా పరిశీలించలేదు. అందుకే అవి స్వేచ్ఛగా తప్పుడు పత్రాలు సమర్పించినా వాటిని నిర్ధారించుకోకుండా అధికారులు ఆమోదించారు. కంపెనీలు ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవా? తప్పుడు పత్రాలా అని నిర్ధారించే వ్యవస్థ టీటీడీలో ఉండాలి. సాంకేతిక కమిటీలో ఉన్న సభ్యులే, ప్లాంట్‌ల తనిఖీ కమిటీలో ఉంటున్నారు. ఇది సరైనది కాదు. తాము ఎలాంటి నెయ్యిసరఫరా చేసినా వాటి నాణ్యతను కనిపెట్టే ల్యాబ్‌ టీటీడీలో లేదన్న ధీమాతోనే అక్రమార్కులు కల్తీనెయ్యిని సరఫరాచేశారని దినేశ్‌కుమార్‌ తన నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టీటీడీ లాబొరేటరీని బలోపేతం చేయాలని సిఫారసు చేశారు. నాణ్యత బాగోలేదని తిరస్కరించిన ట్యాంకర్లపై నియంత్రణకు టీటీడీలో ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. కాబట్టి, ఇకపై అలాంటి నియంత్రణ ఏర్పాటు చేయాలి. ఒక్కసారి కల్తీజరిగిందని నిర్ధారణ అయితే, సంబంధిత కంపెనీల ట్యాంకర్లను సీజ్‌చేయడంతోపాటు సరఫరాదారుపై చర్యలు తీసుకోవాలని సిట్‌ సిఫారసు చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సిట్‌తోపాటు దినేశ్‌కుమార్‌ కూడా సిఫారసు చేశారు. టీటీడీలో ప్రత్యేకమైన ఆహార భద్రతాను పరీక్షించే అధికారి లేరు. ఇదో కొరత. కాబట్టి ఆహారభద్రతా అధికారిని డిప్యూటేషన్‌పై టీటీడీలో నియమించాలి.

- అమరావతి,ఆంధ్రజ్యోతి

Updated Date - May 03 , 2026 | 04:10 AM