Share News

అలిపిరిలో నిరీక్షణకు ‘చెక్‌’

ABN , Publish Date - May 11 , 2026 | 04:33 AM

తిరుమలకు వచ్చే యాత్రికుల వాహన తనిఖీల సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది.

అలిపిరిలో నిరీక్షణకు ‘చెక్‌’

  • రూ.4.25 కోట్లతో అదనపు చెక్‌ పాయింట్‌ నిర్మాణం

  • ఆర్టీసీ, మినీ బస్సులు, కార్గోల తనిఖీకి ప్రణాళిక

  • ప్రధాన తనిఖీ కేంద్రంపై తగ్గనున్న ఒత్తిడి

తిరుమల, మే 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు వచ్చే యాత్రికుల వాహన తనిఖీల సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది. అలిపిరి సమీపంలో ప్రస్తుతమున్న తనిఖీ కేంద్రానికి అనుసంధానంగా సమీపంలోనే మరో తనిఖీ కేంద్రాన్ని నిర్మించి ప్రత్యేకంగా ఆర్టీసీ, మినీ బస్సులతో పాటు ట్రాన్స్‌పోర్టు వాహనాలను తనిఖీ చేయాలని భావిస్తోంది. రూ.4.25 కోట్లతో ఈ అదనపు తనిఖీ కేంద్రాన్ని నిర్మించేందుకు తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది.

రోజుకు 10 వేలకుపైగా వాహనాలు

ఒకప్పుడు వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలో మాత్రమే రద్దీగా కనిపించే అలిపిరి తనిఖీ కేంద్రం ప్రస్తుతం రోజూ వాహనాలతో కిక్కిరిసిపోతోంది. కొవిడ్‌ తర్వాత చాలా మంది భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు వస్తున్న క్రమంలో నిత్యం అలిపిరి చెక్‌పాయింట్‌ వాహనాలతో రద్దీగా మారుతోంది. గరుడ సర్కిల్‌ నుంచి తనిఖీ కేంద్రం వరకు నెమ్మదిగా ముందుకు కదులుతూ కనిపిస్తున్నాయి. రోజూ పదివేలకు తగ్గకుండా వాహనాలు వస్తున్న క్రమంలో చాలా సమయం తనిఖీ కేంద్రం వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


తగ్గనున్న నిరీక్షణ సమయం

ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రంలో రెండు సర్వీస్‌ రోడ్లను మినహాయిస్తే 12 ప్రవేశ మార్గాలున్నాయి. ఇందులో రెండింటినీ ద్విచక్ర వాహనాలకు కేటాయిస్తారు. కాగా, సాధారణ రోజుల్లో 11, 12 నంబర్ల మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. రద్దీ రోజుల్లో అదనంగా 10వ నంబరు మార్గాన్ని కూడా కేటాయిస్తారు. మిగిలిన ప్రవేశమార్గాలను నాలుగు చక్రాల వాహనాలకు కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం వాహనాల రద్దీ పెరిగిపోయి భక్తులు ఇబ్బంది పడుతున్న క్రమంలో అదనపు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాన తనిఖీ కేంద్రంపై ఒత్తిడి తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన తనిఖీ కేంద్రం దాటిన తర్వాత వినాయక స్వామి ఆలయం వరకు దాదాపు 900 మీటర్ల పొడవుతో డివైడర్‌ ఉంది. డివైడర్‌ కుడివైపున ప్రస్తుతం ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. కాబట్టి అదనపు తనిఖీ కేంద్రాన్ని వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని, ఇందులో కేవలం ఆర్టీసీ బస్సులు, మినీ బస్సులు, ట్రాన్స్‌పోర్టు వాహనాలను తనిఖీ చేయడానికి వీలుగా ఉంటుందని టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ బృందం నివేదికను బోర్డు ముందుంచింది. వినాయకస్వామి ఆలయం నుంచి ప్రధాన తనిఖీ కేంద్రం వరకు అంటే దాదాపు 180 నుంచి 190 బస్సులు సరిపోతాయని లెక్కించారు. ప్రస్తుతం రోజుకు సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులు, రెండు వందల వరకు మినీ బస్సులు, 80 నుంచి 90 ట్రాన్స్‌పోర్టు వాహనాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. ఈ వాహనాలను ప్రధాన తనిఖీ కేంద్రం వద్ద నుంచి ముందుకు పంపితే డివైడర్‌కు కుడివైపునే వెళ్లి అదనపు తనిఖీ కేంద్రానికి చేరుకుంటాయి. తద్వారా ప్రధాన తనిఖీ కేంద్రంపై ఒత్తిడి తగ్గిపోతుంది. పైగా, అక్కడున్న రెండు ప్రవేశమార్గాలు నాలుగు చక్రాల వాహనాలకు కేటాయించడం ద్వారా వాహన రద్దీని నియంత్రించవచ్చు. ఈ అదనపు తనిఖీ కేంద్రంలో రెండు స్కానర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు.

Updated Date - May 11 , 2026 | 04:37 AM