TTD: అనేక ఏళ్లుగా ‘నో’.. యనమల కోసం ‘ఎస్’ గేట్లు ఎత్తేశారు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:31 AM
ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు. కొన్నాళ్లు బాగానే నిర్వహిస్తారు. తర్వాత... నిర్వహణ భారమవుతుంది. ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి...
టీటీడీకి పెనుభారంగా ‘స్వీకరణ’ ఆలయాలు
వేటినీ తీసుకోరాదని 28 ఏళ్ల కిందటే తీర్మానం
పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి
పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చినా నిరాకరణ
యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు
రెండు నెలల క్రితం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి.. అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు
‘టేకోవర్’ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు
ఆర్థిక, న్యాయపరమైన వివాదాలతో సతమతం
అందుకే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు. కొన్నాళ్లు బాగానే నిర్వహిస్తారు. తర్వాత... నిర్వహణ భారమవుతుంది. ఆ వెంటనే ‘టీటీడీ పరిధిలోకి తీసుకోండి’ అని విన్నవించుకుంటారు! మరి టీటీడీ ఏం చేయాలి? అలా.. ‘టేకోవర్’ చేస్తూ పోతే ఆగేదెప్పుడు? అందుకే... ‘ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదు’ అని 1997లో బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ... ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కనపెట్టేసింది. అందులోనూ... రెండు నెలల క్రితం ‘నో’ చెప్పిన ఆలయానికే ఇప్పుడు ‘ఎస్’ చెప్పింది. అది... మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏ.వి.నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం! ఇప్పుడు యనమల కోరితే చేశారు! రేపు... అంతకుమించిన బలమైన సిఫారసుతో ఇంకెవరైనా వచ్చి ఫలానా ఆలయాన్ని టేకోవర్ చేయండి అంటే కాదనగలరా?
ఖర్చుతో కొలవలేని ‘భారం’
ప్రస్తుతం టీటీడీ ఏడు ప్రధాన ఆలయాలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏటా రూ.140 కోట్లుకాగా... ఖర్చు రూ.117 కోట్లు. అలాగే... రాష్ట్రం వెలుపల టీటీడీకి 19 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నుంచి ఏటా రూ.47 కోట్ల ఆదాయం వస్తోంది. వాటి నిర్వహణ, సిబ్బంది జీతాలు, స్వామివారి కైంకర్యాలకు కలిపి రూ.47 కోట్లు ఖర్చవుతోంది. వీటితో ఎలాంటి ఇబ్బందీ లేదు. అసలు సమస్యల్లా... ‘టేకోవర్’ ఆలయాలతోనే! గత కొన్నేళ్లుగా టీటీడీ 34 చిన్న ఆలయాలను తన పరిధిలోకి తీసుకుంది. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నిర్మించి, నిర్వహించలేక టీటీడీకి అప్పగించినవే. వీటి ద్వారా ఏటా టీటీడీకి వచ్చే ఆదాయం కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే. కానీ, వాటి నిర్వహణకు ప్రతి ఏటా రూ.20.1 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆలయాలు ఆర్థిక భారంగా మారుతున్నా వెనక్కి వెళ్లలేని పరిస్థితి. నిజానికి... వెంకన్నకు వచ్చే ఆదాయంతో పోల్చితే ఏటా రూ.20 కోట్లు భరించడం కష్టమేమీ కాకపోవచ్చు. కానీ... ఇందులో ఆర్థిక అంశాలకు అతీతమైన సమస్యలున్నాయి. ఒక్కసారి టీటీడీ ఏదైనా ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకుంటే... స్వామి వారి కైంకర్యాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్వహించాల్సిందే. ‘టీటీడీ గుడి’ కాబట్టి... వేడుకలు, ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని భక్తులు ఆకాంక్షిస్తారు.
ఇక... అప్పటికి ఆ ఆలయాల్లో పని చేస్తున్న సిబ్బందితో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. ‘గుడితోపాటు మమ్మల్నీ టేకోవర్ చేసుకోవాల్సిందే’ అంటూ ఇప్పటికే టీటీడీపై పలువురు కేసులు వేశారు. అన్నింటికంటే మించి... మారుమూల ప్రాంతాల్లో ఉన్న ‘టేకోవర్’ ఆలయాల్లో పని చేసేందుకు టీటీడీ సిబ్బంది ముందుకు రావడంలేదు. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉండటంతో... ప్రైవేటు ఆలయాల ను తన పరిధిలోకి తీసుకోకూడదని 1997లో నిర్ణయించుకుంది. అప్పుడూ సీఎంగా ఉన్న చంద్రబాబు టీటీడీ బోర్డు ద్వారా ఈ తీర్మానం చేయించారు. ఆ తర్వాత... ‘మా ఆలయాన్ని టేకోవర్ చేయండి’ అంటూ పదులకొద్దీ విన్నపాలు వచ్చాయి. కానీ... బోర్డు ససేమిరా అంది. 2005లో కూడా ‘ఎలాంటి ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోవడానికి వీల్లేదు’ అని తీర్మానం చేసింది. 2021లో దీనికి చిన్న వెసులుబాటు ఇచ్చారు. నేరుగా ఆలయాల నిర్వహణ చేపట్టకుండా... ధూపదీప నైవేద్యానికీ ఇబ్బందుల్లో ఉన్న వాటికి మాత్రం శ్రీవాణి ట్రస్ట్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయం చేయాలని అప్పటి బోర్డు తీర్మానం చేసింది. ఇలా కొన్ని వందల ఆలయాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది.
మారిన సీన్...
రెండు నెలల్లోనే సీన్ మారిపోయింది. అదే ప్రతిపాదనను గత నెల 16న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించారు. విచిత్రమేమిటంటే... అంతకుముందు నిరాకరణకు కారణాలన్నీ ఇందులోనూ ప్రస్తావించారు. చివర్లో మాత్రం... అప్పుడు ‘డిఫర్డ్’... ఇప్పుడు ‘అప్రూవ్డ్’! ఇలాగే, ఇకపైనా మరింతమంది నేతలు, ‘పవర్‌ఫుల్’ సిఫారసులతో ఒత్తిళ్లు తెస్తే టీటీడీ ఏం చేస్తుంది? గతంలో లాగా నిర్ద్వంద్వంగా ‘నో’ చెప్పగలదా? అలా చెబితే యనమల ఊరిలోని గుడికి ఒక రూలు... మాకు ఒక రూలా? అని నిలదీయరా? ఏళ్లతరబడి అమలు చేస్తున్న తీర్మానాన్ని ఒక్కరి కోసం ఎందుకు పక్కన పెట్టినట్లు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, టీటీడీ బోర్డే సమాధానం చెప్పాలి!
ఇన్నేళ్లకు ఇలా..
దాదాపు 28 ఏళ్ల కిందట మూసేసిన ‘టేకోవర్’ గేట్లను టీటీడీ ఇప్పుడు తెరిచేసింది. కాకినాడ జిల్లా తొండం గి మండలం ఏ.వి.నగరం గ్రామంలో ఉన్న ‘శ్రీ శ్రీదే వీ భూదేవీ సహిత కల్యాణ వేంకటేశ్వర స్వామి’ ఆలయాన్ని టీటీడీ తన పరిధిలోకి తీసుకుంది. దీనిపై టీటీడీ బోర్డు చేసిన తీర్మానం మేరకు జీవో విడుదలైంది. కొత్త సంవత్సరం తొలిరోజైన గురువారం దేవదాయ శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ హరిజవహర్ లాల్ ఈ ఏడాది విడుదల చేసిన తొలి జీవో ఇదే. మాజీ మంత్రి యనమల సిఫార్సులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం యనమల సొంత గ్రామమైన ఏ.వి.నగరంలో ఉంది. దీనిని టీటీడీ పరిధిలోకి తీసుకోవాలని ఆయనే బోర్డును కోరారు. దీనిపై 2024 డిసెంబరులో టీటీడీ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సదరు ఆలయాన్ని సందర్శించి... ఆలయ విస్తీర్ణం, సిబ్బంది, ఆదాయ వ్యయాలు, ఆస్తులు, ఇతర అంశాలన్నింటితో బోర్డుకు నివేదిక సమర్పించింది. ఒక ట్రస్ట్ పేరుతో నిర్వహణలో ఉన్న ఆలయ నిర్వహణకు ఏటా రెండు కోట్ల అదనపు ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ నివేదికను 2025 అక్టోబరు 28వ తేదీన జరిగిన బోర్డు మీటింగ్‌లో అధికారులు ప్రవేశపెట్టారు. దీనిపై సుదీ ర్ఘ చర్చ జరిగింది. ఇకపై కొత్తగా ప్రైవేటు ఆలయాల ను స్వీకరించరాదంటూ గతంలో వేర్వేరు సందర్భాల్లో చేసిన తీర్మానాలనూ పొందుపరుస్తూ... యనమల విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఏ.వి.నగరంలోని ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిరాకరించారు.