Share News

భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:59 AM

తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం

  • టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

  • అందుబాటులోకి అత్యాధునిక ఫుడ్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌

తిరుమల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ల్యాబ్‌ను గురువారం ఆయన సందర్శించి తొలి అనాలిసిస్‌ రిపోర్టును పరిశీలించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించిన స్టేట్‌ ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌లో రెండున్నర నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌(ఎస్ఓపీ) మేరకు పరీక్షలు నిర్వహించి, తొలి రిపోర్టును సిద్ధం చేయడం విశేషమన్నారు. ఎఫ్‌ఎస్ఎస్ఐ సహకారంతో అధికారులు సమర్థంగా పనిచేసి ల్యా బ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ల్యాబ్‌లో 50కి పైగా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు సేవలందిస్తున్నట్టు వివరించారు. త్వరలో 20 మంది శాశ్వత ఉ ద్యోగులను నియమించనున్నట్టు ప్రకటించారు. రోజూ తిరుమలలోని వివిధ వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్‌ కౌంటర్లు, హోటళ్లు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, మార్కెటింగ్‌ విభాగంలోని ముడి సరుకుల నుంచి సుమారు 40 రకాల ఆహార నమూనాలు, అలాగే జల ప్రసాదం, వాటర్‌ లైన్ల నుంచి 20 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఇంతకుముందు నీటి పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు పంపాల్సి వచ్చేదని, ప్రస్తుతం తిరుమలలోనే ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ ద్వారా ఖచ్చిత ఫలితాలు పొందుతున్నామన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 06:00 AM