18న శ్రీవారి ఆర్జితసేవల అక్టోబరు నెల కోటా విడుదల
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:36 AM
అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఈనెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఈనెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల లక్కీడిప్ కోటా ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. దీనికోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ర్టేషన్ చేసుకుని ఆ తర్వాత ఎంపికైన భక్తులు టికెట్లు పొందవచ్చు. ఇక 21న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు.., వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తుల టోకెన్లు జారీ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు.
14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం జరగనున్నాయి. ఈక్రమంలో ఈ రెండ్రోజుల్లో ప్రొటోకాల్ పరిధిలో ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ముందురోజు అంటే 13, 16వ తేదీల్లో బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 17వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా రద్దయ్యాయి. కాగా, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. 10, 11 తేదీల్లో 1,65,282 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.