TTD Makes Extensive Arrangements: రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:41 AM
వైకుంఠద్వార దర్శనాల తరహాలోనే రథసప్తమికి ఏర్పాట్లు చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో....
వైకుంఠ ద్వార దర్శనాల తరహాలోనే...
ఈ నెల 24 నుంచి 26 వరకు ఎస్‌ఎ్‌సడీ టోకెన్లు రద్దు
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి
తిరుమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైకుంఠద్వార దర్శనాల తరహాలోనే రథసప్తమికి ఏర్పాట్లు చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో ఏ ఒడిదొడుకులు, ఒత్తిళ్లు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాలు విజయవతమయ్యాయన్నారు. ఈ నెల 25న జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, అదనపు ఎస్పీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
25న ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
రథ సప్తమి సందర్భంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. తిరుపతిలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీని కూడా రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈ నెల 24న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని ప్రకటించారు.