ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్య సేవ’ ప్రారంభం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:21 AM
టీటీడీ ఆస్పత్రుల్లో ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ సేవకు ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ .....
ప్రపంచవ్యాప్త వైద్య నిపుణులకు టీటీడీ ఆహ్వానం
నమోదుకు అందుబాటులోకి ఐటీ అప్లికేషన్
తిరుమల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆస్పత్రుల్లో ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ సేవకు ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర ప్రారంభించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి, పాల్గొనే వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలుచేసి ఎక్కువమంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సేవలందించవచ్చని వెల్లడించారు.
మూడు, ఏడు రోజుల సేవలు
సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులకు ఏడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పించనున్నట్టు ఈవో రవిచంద్ర వివరించారు. వీరికి తిరుమల, తిరుపతిల్లో వసతి, భోజన సౌకర్యాలను టీటీడీ కల్పించనుంది. అశ్విని ఆస్పత్రితో పాటు తిరుపతిలో స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, శ్రీపద్మావతి చిన్నప్లిలల ఆస్పత్రి, ఎస్వీ గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించనున్నారు. హిందూ మతానికి చెందిన ఆసక్తి కలిగిన వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ వైబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్-శ్రీవారిసేవ/ఇన్‌స్ట్ట్రక్షన్స్’ ద్వారా తమ స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్‌లోని కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్‌ఏ శాస్ర్తి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, బెంగళూరుకు చెందిన ఈఎ్‌సఐ ఆస్పత్రి ఆర్థో విభాగ హెడ్ డాక్టర్ పురుషోత్తం టీటీడీ ఈవోతో వర్చువల్‌గా మాట్లాడి, ఆస్పత్రుల్లో సేవలందించే అవకాశం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు డాక్టర్ శరత్, వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, వివిధ ఆస్పత్రుల డైరెక్టర్లు, వైద్యులు పాల్గొన్నారు.