భగవంతుడిపైనే పగబట్టారు
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:34 AM
వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదని.. వారు భగవంతుడి మీద పగబట్టారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. శ్రీవారికి ఏడు కొండలు ఎందుకు..
వాళ్లు సర్వనాశనమైపోతారు.. వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదు
తప్పు చేసినవారు భగవంతుడి ముందు మోకరిల్లే వరకు యుద్ధం: పవన్ కల్యాణ్
వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదని.. వారు భగవంతుడి మీద పగబట్టారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. శ్రీవారికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు మాత్రమే చాలంటారు. తిరుమల లడ్డూని కల్తీ చేసి, సీబీఐ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటారు. భగవంతుడిపై పగబట్టిన వాడు సర్వనాశనమైపోతాడు తప్ప బతికిన దాఖలాల్లేవు. దేవుడు, మతం అనేవి సున్నితమైన అంశాలు. వీటి విషయంలో జనసేన ముందు నుంచీ ఆచితూచి మాట్లాడుతోంది. కల్తీ నెయ్యి ఘాతుకానికి పాల్పడిన వారి అసలు ఉద్దేశం తెలియాలంటే ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. వారి హయాంలో హిందూ ఆలయాలపై ఎన్నో దాడులు జరిగాయని, రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారని, అంతర్వేదిలో రథం కాలిపోతే పిచ్చోడి పని అన్నారరు. దుర్గమ్మ ఉత్సవ రథానికి ఉన్న వెండి సింహాన్ని చోరీ చేస్తే పోతే పోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు 219 వరకు జరిగాయి’ అని తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అనేది హిందూ విశ్వాసాలపై దెబ్బకొట్టే ప్రయత్నమని అన్నారు. ‘అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దేశమంతా ఎంతో కాలం ఎదురుచూసింది. అలాంటి అయోధ్యకు కూడా సుమారు లక్ష కల్తీనెయ్యితో తయారైన తిరుమల లడ్డూలని పంపారరంటే వీరు హిందూమతంపై ఏ స్థాయిలో కుట్ర చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని చెప్పారు.
రాజకీయ లబ్ధి మా లక్ష్యం కాదు..
తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు, పందికొవ్వు, గొడ్డు కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ రిపోర్టులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయం మాకు తెలిసిన తర్వాత చెప్పకపోతే నేరం అవుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. దీని వల్ల మేమెలాంటి రాజకీయ లబ్ధీ పొందాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ముందు ఇలాంటి విషయాలు చెబితే రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన రెండో నెలలోనే ఆ రిపోర్టులో ఏముందో చెప్పకపోతే నేరం అవుతుంది. తిరుమలకు సరఫరా చేసేందుకు ఆయా డమ్మీ డెయిరీలు.. సుమారు 58 లక్షల కేజీల పామాయిల్ కొన్నాయి. మరో 2 లక్షల కేజీల వరకు కెమికల్స్ కొన్నాయి. ఆన్ రికార్డుగా దొరికారు. సీబీఐ ఎక్కడా వీరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఈ కల్తీ వ్యవహారంలో ఇతర మతాలకు ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ వాళ్లు చేసిన తప్పునకు క్షమాపణ కోరకుండా.. పైగా మమ్మల్ని క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉంది. 2022లోనే కల్తీ జరిగిందని నివేదిక వస్తే దాన్ని తొక్కి పెట్టారు. తెలియక చేస్తే పొరపాటు అవుతుంది. తెలిసి చేస్తే నేరమవుతుంది. 2019లో నెయ్యి ధర బహిరంగ మార్కెట్‌లో కిలో కనీసం రూ.420గా ఉండేది. రూ.319కే సరఫరా చేస్తామంటే అప్పటి పాలకులు గుడ్డిగా ఎలా అంగీకరించారు? ఓ సాధారణ గృహిణి కూడా అది కల్తీ నెయ్యి అని చెప్పగలదు. వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటు అంటారు. నెయ్యిలో కల్తీ లేదు.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. అన్నీ తెలిసి అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపారు. హిందూ విశ్వాసాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం ఇది. దేవుడితో పెట్టుకుంటే మట్టికరుస్తారు. ఈ ఘటనతో ముడిపడిన ప్రతి ఒక్కరినీ దోషులుగా నిలబెడతాం.