Share News

బీజేపీ మరింత క్రియాశీలం కావాలి!

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:32 AM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో బీజేపీ కూడా మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలిసింది.

బీజేపీ మరింత క్రియాశీలం కావాలి!

  • కల్తీ లడ్డూ వ్యవహారం ఆ పార్టీ ద్వారానే మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది: చంద్రబాబు సూచన

  • తమ నేతలకు ఆదేశాలిస్తామన్న మాధవ్‌

  • కలిసికట్టుగా ఎదుర్కోవలసిందేనన్న పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో బీజేపీ కూడా మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఇలాంటి అంశాలను బీజేపీ అయితేనే మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నట్లు సమాచారం. ఉండవల్లి నివాసంలో గురువారం కూటమి నేతలతో ఆయన సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా తేలినా జగన్‌ అండ్‌ కో నిస్సిగ్గుగా ఏం జరగలేదంటూ బుకాయిస్తున్నారని, పైగా తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకుంటే మున్ముందు మరింత బరితెగించి.. వారి తప్పులను మనపై నెట్టేస్తారని హెచ్చరించారు. హిందూధర్మం.. హిందూ మతవిశ్వాసాల విషయంలో ఇతర పార్టీలు ఎన్ని మాట్లాడినా.. బీజేపీ స్పందిస్తేనే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో బీజేపీ నుంచి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు పెద్దగా స్పందించడం లేదని చెప్పారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ స్పందించి.. తమ పార్టీ నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలిస్తామని చెప్పినట్లు తెలిసింది. తిరుమల వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమని, వేరే ఆలోచనకు తావులేకుండా తాము కూడా కూటమి పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను.. హిందూ దేవుళ్లను.. హిందూ మతాన్ని దెబ్బతీసి, నిర్వీర్యం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి వాటిని కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవలసిందేనని ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వైసీపీకి పెద్దగా సానుకూలత లేదని తేలిందని.. ఆ పార్టీ గ్రాఫ్‌ మరింత దిగజారిందని, అందుకే జగన్‌ ప్రజల్లోకి వస్తూ ఇమేజ్‌ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీకి చెందిన మంత్రులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. లడ్డూ వ్యవహారంపై మూడు పార్టీల నుంచి త్రిసభ్య కమిటీ వేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నేతల మధ్య చర్చ జరిగింది. దీనిపై మరోసారి కూర్చుని తుది నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు.


జంతు కొవ్వు దక్షిణ కొరియా నుంచి దిగుమతి!

సమావేశంలో.. నెయ్యి కల్తీ ఎలా చేశారో మంత్రి పయ్యావుల కేశవ్‌ కూటమి నేతలందరికీ సవివరంగా తెలియజేశారు. అసలు పాలే లేకుండా కేవలం పామాయిల్‌, రసాయనాలతో నెయ్యి తయారు చేసి తిరుమలకు సరఫరా చేశారని.. ఆయా డెయిరీలు.. 58 లక్షల కేజీల పామాయిల్‌, సుమారు 2 లక్షల కేజీల వివిధ రకాల రసాయనాలు కొనుగోలు చేసినట్లు ఆన్‌ రికార్డు ఉందని ఆయన తెలిపినట్లు సమాచారం. జంతు కొవ్వు అయితే తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయన్నట్లు తెలిసింది. టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చిన రూ.4 కోట్లు అంతిమంగా ఎవరికి చేరాయో తేలితే అసలు సూత్రధారుల గుట్టు రట్టు అవుతుందన్నారు. అలాగే నెయ్యి వ్యవహారంలో భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) అనుమతులు అవసరం లేదని బోర్డులో తీర్మానం చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో కూడా వెలుగు చూడాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి ఎన్నో అంశాలపై మరింత దృష్టి సారిస్తే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులను ప్రజల ముందు నిలబెట్టవచ్చని కేశవ్‌ చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Feb 06 , 2026 | 03:32 AM