కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:28 AM
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా చంద్రబాబు అసత్య ప్రచారమే చేస్తున్నారని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
అయినా చంద్రబాబు దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా చంద్రబాబు అసత్య ప్రచారమే చేస్తున్నారని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. దీనిపై స్వామి వారి ముందు ప్రమాణం చేయడంతో పాటు, సత్యశోధన పరీక్షకూ సిద్ధమేనని సవాల్ చేశారు. గురువారం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, గొల్ల బాబూరావు, గురుమూర్తిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారంతో సీఎం చంద్రబాబు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. ఎన్‌డీడీబీ రిపోర్టు సహా సీబీఐ కూడా నెయ్యిలో జంతు కొవ్వులు లేవని నివేదికిచ్చినా.. దీనిపై విచారణకు మరో కమిటీ ఏర్పాటు చేయడం రాజకీయ కుట్రేనని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి నాణ్యతా పరీక్ష నిర్వహించిన నాలుగు ట్యాంకర్లలో జంతుకొవ్వు ఉందా? లేదా?, ఒకవేళ ఉంటే దాన్ని లడ్డూ ప్రసాదం తయారీలో వాడారా? లేదా? అన్నదానిపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దని సుప్రీంకోర్టు చెప్పినా కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గత పది రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.