Share News

లడ్డూ నెయ్యిని కల్తీ చేశారనేందుకు అదే నిదర్శనం.!

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:30 AM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ పాలకమండలి మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయారు. మొన్నటిదాకా ‘కల్తీ’ మాటెత్తని ఆయన... ‘కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు’ అని సన్నాయి నొక్కులు నొక్కారు.

లడ్డూ నెయ్యిని కల్తీ చేశారనేందుకు అదే నిదర్శనం.!

  • ‘నెయ్యి’ నమూనాలో ఎస్‌-వాల్యూ 117

  • ఇది పంది కొవ్వు కలిసిందనే సంకేతం

  • స్వచ్ఛమైన ఆవునెయ్యి ఎస్‌-వాల్యూ 104 దాటొద్దు

  • అన్ని ప్రమాణాల్లో అంతకుమించే

  • కొవ్వులతో కల్తీ చేశారనేందుకు అదే నిదర్శనం

  • కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్‌డీడీబీలో పరీక్ష

  • నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన సీఎ్‌ఫటీఆర్‌ఐ

  • కళ్లుమూసుకున్న నాటి పాలక మండలి, అధికారులు

  • అడ్డంగా దొరికిపోయినా బుకాయింపు మానని వైవీ

  • ‘‘స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్‌-వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. అంతకుమించితే... జంతువుల కొవ్వులు కలిపి కల్తీ చేసినట్లే’’! సింపుల్‌గా గూగుల్‌ చేస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ‘నెయ్యి’ పేరిట టీటీడీకి సరఫరా చేసిన ‘రసాయన మిశ్రమం’లో ఎస్‌-వ్యాల్యూ ఏకంగా 117 వచ్చినట్లు పాడి పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నిర్ధారించింది. అంటే... అందులో ‘ల్యార్డ్‌’ (పంది కొవ్వు) కలిసిందని తేల్చింది.

  • తప్పు చేసిన వాళ్లు లెంపలేసుకోవాలి!.. పాపం చేసిన వాళ్లు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి!

  • కానీ... వైసీపీ నేతల తీరే వేరు! కించిత్‌ పశ్చాత్తాపం లేకపోగా... ఎదురుదాడి, బుకాయింపులే వారి దారి!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ పాలకమండలి మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయారు. మొన్నటిదాకా ‘కల్తీ’ మాటెత్తని ఆయన... ‘కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు’ అని సన్నాయి నొక్కులు నొక్కారు. జంతువుల కొవ్వు కలవలేదంటున్న ఆయన.. పంది కొవ్వు కలిసిందని ఏకంగా జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) ధ్రువీకరించిందని చెప్పగా... ‘అది అనుమానం మాత్రమే’ అని వెల్లడించారు. అసలు నిజం ఏమిటంటే... జగన్‌ హయాంలో తిరుమలకు సరఫరా అయ్యింది నెయ్యే కాదు! పామోలిన్‌ నూనెలో రకరకాల రసాయనాలు కలిపి పంపారు. మరో దారుణమైన సత్యం ఏమిటంటే... ‘నెయ్యే కాని ఆ నెయ్యి’లో జంతువుల కొవ్వులూ కలిశాయి. ఇది... అక్షరాలా నిజం. పాడిపరిశ్రమకు సంబంధించిన అత్యున్నత నియంత్రణ సంస్థ ‘ఎన్‌డీడీబీ-కాఫ్‌’ ప్రయోగశాలలోనే ఇది రుజువైంది. అందులో... పంది కొవ్వూ (ల్యార్డ్‌) కలిసిందని తేలింది. అయినా సరే... ‘అది అనుమానం’ మాత్రమే అని వైవీ సుబ్బారెడ్డి దబాయించడం గమనార్హం. ప్రపంచంలో ఏ ప్రయోగ శాల అయినా... తన పరీక్షల ఫలితాలను ‘ఇదే ఫైనల్‌’ అని చెప్పదు. చివరికి... మనం రక్తపరీక్ష చేయించుకున్నప్పటికీ ‘కో రిలేట్‌’ చేసుకోవాలని రిపోర్ట్‌లో ఉంటుంది. నెయ్యికి సంబంధించి ఎన్‌డీడీబీ నివేదికలో ‘సస్పెక్టెడ్‌’ అనే పదానికి అర్థం కూడా అదే!


ఎన్‌డీడీబీ చెప్పిందిదే... ‘స్వచ్ఛమైన ఆవు నెయ్యి’ అంటూ జగన్‌ హయాంలో ట్యాంకర్ల కొద్దీ కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు. అప్పటికే వచ్చిన ఫిర్యాదులు, బలమైన అనుమానాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ అధికారులు ‘నెయ్యి’ శాంపిళ్లను ఎన్‌డీడీబీ ప్రయోగశాలకు పంపించారు. అందులో నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. అందులో... బీటా సిటోస్టిరాల్‌, లారిక్‌యాసిడ్‌, లిగ్నోసెరిక్‌ యాసిడ్‌ వంటివి పరిమితికి మించి ఉన్నాయని తేల్చింది. చివరికి, జంతువుల కొవ్వు, పంది కొవ్వూ (ల్యార్డ్‌) ఉందని నిర్ధారించింది. ఆవు నెయ్యి స్వచ్ఛతను ‘ఎస్‌-వాల్యూ’ ఆధారంగా గుర్తిస్తారు. ఒక ప్రమాణం ప్రకారం... ఎస్‌-వాల్యూ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాలి. కానీ... ఏకంగా 117.15 ఉన్నట్లు తేలింది. పంది కొవ్వు (ల్యార్డ్‌) కలిపితేనే ఇంత ఎస్‌-వాల్యూ వస్తుంది.

ఎప్పుడో కల్తీ తేలినా... వైవీ సుబ్బారెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా ఉండగానే... కల్తీ బండారం బయటపడింది. టీటీడీకి సరఫరా చేసిన 3 ట్యాంకర్లు, ఒక టిన్‌ నెయ్యిని 2022 జూన్‌ 8న పరీక్షించగా... అందులోనూ కల్తీ జరిగిందని కేంద్ర ఆహార-సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎ్‌ఫటీఆర్‌ఐ) నిర్ధారించింది. 2022 ఆగస్టు 3న టీటీడీకి నివేదించింది. మరి... కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నిస్తే, ‘నాకేం తెలియదు. అంతా అధికారులే చూసుకోవాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ‘నెయ్యి కల్తీ జరిగింది’ అని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ చెప్పినా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం కాదా? చైర్మన్‌ హోదాలో ఆయన ఏం చేసినట్లు? కల్తీని నిర్ధారించే 2 నివేదికలు కళ్లముందున్నా వైవీ కప్పదాట్లు ప్రదర్శిస్తున్నారు.

ఎన్‌డీఆర్‌ఐ... ఎందుకిలా?

సీఎ్‌ఫటీఆర్‌ఐతోపాటు ఎన్‌డీడీబీ ప్రయోగశాలల్లో కల్తీ నిర్ధారణ అయినప్పటికీ... ‘సిట్‌’ మరోసారి శాంపిళ్లను హరియాణాలోని ఎన్‌డీఆర్‌ఐకి పంపింది. ఆ సంస్థ...అటూ ఇటూ తేల్చని ఒక అసహాయ నివేదికను ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే...టీటీడీకి నెయ్యి కొనుగోలు టెండర్‌ నిబంధనలు సడలించిన సమయంలో...ఆ తర్వాత బోలేబాబా, దాని అనుబంధ డెయిరీల తనిఖీకి నియమించిన బృందంలో ఎన్‌డీఆర్‌ఐకి చెందిన ఇద్దరు అధికారులూ సభ్యులుగా ఉన్నారు. ‘అంతా ఓకే’ అంటూ గేట్లు ఎత్తేశారు. ఇప్పుడు అదే ఎన్‌డీఆర్‌ఐ... నిక్కచ్చిగా నివేదిక ఇస్తుందని ఎలా ఆశించగలం!?

Updated Date - Feb 06 , 2026 | 06:47 AM