తప్పు చేసి బుకాయింపు!
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:16 AM
తప్పు చేయడం.. బుకాయించడం.. వారు చేసిన తప్పును మన మీదకు నెట్టేయడం వైసీపీ వారికి అలవాటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైసీపీ నేరప్రవృత్తి ఇదే: చంద్రబాబు
వాళ్లు తప్పుచేసి మన మీదకు నెట్టేస్తారు
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం
ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి
విమర్శించాలని విమర్శిస్తే లాభం లేదు:సీఎం
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): తప్పు చేయడం.. బుకాయించడం.. వారు చేసిన తప్పును మన మీదకు నెట్టేయడం వైసీపీ వారికి అలవాటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడి కత్తి దాడి, బాబాయి హత్య, గులకరాయి డ్రామా, పరకామణి చోరీ ఇవన్నీ వారి నేరప్రవృత్తికి అద్దం పట్టేవేనని స్పష్టంచేశారు. తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా ఉదంతంలోనూ.. ముందు అసలు కల్తీయే జరగలేదని బుకాయించారని, ఆ తర్వాత సీఐడీ విచారణపై తమకు నమ్మకం లేదంటూ కోర్టుకు వెళ్లారని.. చివరికి సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేస్తే తన పేరు పత్రికల్లో రాయకుండా చూడాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లారని.. వైసీపీ నాయకులందరి నైజం ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి సిట్ నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సదరు నివేదికలో పేర్కొన్నారంటూ వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని సీఎం చెప్పారు. నివేదిక అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత అందులోని వాస్తవాలతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని మంత్రులను ఆదేశించారు. కల్తీ నెయ్యి ఉదంతం గానీ.. మరే అంశంపై గానీ.. సరైన విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలిగితే తప్పు చేసిన వారిని ఇరుకునపెట్టగలమన్నారు. విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శించడం వల్ల.. మనం పలుచనవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదని చెప్పారు. సరైన సమాచారంతో చేసే విమర్శకు విలువ ఎక్కువ ఉంటుందని.. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అధికారికంగా చేతికి వచ్చే వరకు వేచి ఉండి.. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆధారసహితంగా ఎండగట్టాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, ఇదే విషయాన్ని నివేదికలో కూడా పేర్కొన్నట్లు తెలుస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయని సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రులు వ్యాఖ్యానించారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ బ్యాంకు ఖాతాలో రూ.4.5 కోట్లు జమయిన విషయాన్ని కూడా సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోందని, అర్హత లేని డెయిరీలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని, దీంతో ఆ డెయిరీలు రసాయనాల మిశ్రమంతో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశాయనికూడా స్పష్టం చేసినట్లు తెలిసిందని తెలిపారు.
మూడేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం
రాబోయే మూడేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలన్న దానిపై మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం మంత్రులను కోరారు. టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడంపైనా క్యాబినెట్‌లో చర్చ జరిగింది.
అధికారంలోకి రాగానే రిలాక్స్
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ నాయకులు మంచి విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థులపై దాడి చేస్తారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి భోజనం చేస్తూ ఆయన పలు అంశాలను వారితో పంచుకున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్లు సైతం మనల్ని గౌరవంగా చూసేవారని, శ్రీపాదరావు స్పీకర్‌గా ఉండగా.. తాను అసెంబ్లీకి రాగానే.. ఏం స్వామీ ఈ రోజు ఏమైనా ఇరుకునపెట్టే కార్యక్రమాలు ఉన్నాయా అని అడిగేవారని గుర్తు చేసుకున్నారు. సురేశ్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్న సమయంలో.. ముందు ప్రతిపక్షంతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలని.. అప్పుడే సభ సజావుగా సాగుతుందని కాంగ్రెస్ మంత్రులకు సలహా ఇచ్చేవారని తెలిపారు. 2008లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మన పార్టీ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాలన్నిటికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
ప్రసాదం అపవిత్రం చేయడం క్షమించరాని నేరం: లోకేశ్
మహాపాపం చేసి కూడా బుకాయించడం జగన్‌కే చెల్లిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం మంత్రివర్గ సమావేశానికి ముందు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులకు ఆయన అల్పాహార విందు ఇచ్చారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా.. సిట్ నివేదికలోని అంశాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
వాసంశెట్టిపై సీరియస్
మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సు చేశారని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల విషయం ప్రస్తావనకు రాగా.. తాను ఆడవాళ్లతో డ్యాన్సులు వేయలేదని, జబర్దస్త్ షోలో ఆడవేషం వేసే మగ వ్యక్తితోనే డ్యాన్సు చేశానని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా అయినా ఎందుకు చేశారని లోకేశ్ ప్రశ్నించారు.