టీటీడీ గదుల పేరుతో మోసం
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:33 AM
టీటీడీ గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. తిరుమలలో గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసగిస్తున్నారు.
నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచన
ఇప్పటివరకు 70 గుర్తించిన అధికారులు
తిరుమల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): టీటీడీ గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. తిరుమలలో గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసగిస్తున్నారు. తిరుమలలో వరాహస్వామి, పాంచజన్యం, కౌస్తుభం ఇలా కొన్ని పేర్లతో దాదాపు 70 నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ వెబ్‌సైట్ ద్వారా గది పొందేందుకు ప్రయత్నించి మోసపోయారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరు, లోగోతో అనధికారికంగా నకిలీ వెబ్‌సైట్లతో భక్తులను మోసగిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే టీటీడీ ఐటీ విభాగం చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ నకిలీ వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నకిలీ వెబ్‌సైట్లలో చాలావరకు బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి నడుపుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ అంశంపై స్పందించిన టీటీడీ.. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్’నే వినియోగించాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించింది.