Share News

ఇక భారీగా నెయ్యి నిల్వ!

ABN , Publish Date - May 15 , 2026 | 04:45 AM

తిరుమలలో నెయ్యి నిల్వల సామర్థ్యం పెరిగింది. 82 వేల కేజీల నుంచి 2.26 లక్షల కేజీల నెయ్యిని నిల్వ చేసుకునేలా నిర్మించిన నూతన ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇక భారీగా నెయ్యి నిల్వ!

  • అందుబాటులోకి మరో నాలుగు భారీ ట్యాంకర్లు

  • 82వేల కిలోల నుంచి 2.26లక్షల కిలోలకు పెరిగిన సామర్థ్యం

  • టీటీడీ నూతన ప్రణాళికతో కల్తీకి అడ్డుకట్ట

  • పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు అవకాశం

తిరుమల, మే14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో నెయ్యి నిల్వల సామర్థ్యం పెరిగింది. 82 వేల కేజీల నుంచి 2.26 లక్షల కేజీల నెయ్యిని నిల్వ చేసుకునేలా నిర్మించిన నూతన ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం అందేలా టీటీడీ ప్రస్తుతం 4 నుంచి 4.50 లక్షల లడ్డూలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. విశేష పర్వదినాలు, ఉత్సవాలు, రద్దీ సమయాల్లో అదనంగా మరో 3లక్షల నుంచి 4 లక్షల లడ్డూలను కూడా తయారు చేస్తారు. ఇక, నైవేద్య ప్రసాదాల కోసం కూడా నెయ్యి అధికంగా వినియోగిస్తారు. ఇలా రోజుకు 15వేల నుంచి 16 వేల కేజీల నెయ్యిని వాడతారు. నెయ్యి వినియోగం అధికంగా ఉన్న క్రమంలో రోజూ రెండు మూడు లారీల నెయ్యి నిల్వలు తిరుమలకు చేరుకుంటున్నాయి. ఈనేపథ్యంలో నెయ్యిని నిల్వ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో టీటీడీ అదనపు ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ 36వేల కేజీల సామర్థ్యంతో పుష్కరిణి పక్కనే ఉన్న నెయ్యి నిల్వ కేంద్రంలో నాలుగు భారీ ట్యాంకర్ల నిర్మాణం చేపట్టి ఇటీవల పూర్తిచేసింది. గతంలో 12 ట్యాంకర్ల ద్వారా కేవలం 82 వేల కేజీలను మాత్రమే నిల్వ చేసుకునే అవకాశముండేది. ప్రస్తుతం మరో నాలుగు ట్యాంకర్లు అందుబాటులోకి రావడంతో మొత్తం 16 ట్యాంకర్ల ద్వారా 2.26 లక్షల కిలోల నెయ్యిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగింది.


అంటే దాదాపు 15 నుంచి 16 రోజులకు సరిపడా నెయ్యిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం నూతన ట్యాంకర్లను పరిశీలిస్తున్నారు. గుర్తించిన లోటుపాట్లను సవరించి త్వరలోనే ప్రారంభించనున్నారు. అలాగే భవిష్యత్తులో మరో లక్ష కేజీలకు కూడా నెయ్యి నిల్వలను పెంచేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. కాగా, నెయ్యి నిల్వ సామర్థ్యం పెరిగిన క్రమంలో కొత్తగా వచ్చే నెయ్యిని పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు సమయం ఉంటుంది. ఒకవేళ కల్తీని గుర్తించినా దాన్ని వెనక్కి పంపి మళ్లీ నాణ్యమైన నెయ్యిని తెప్పించుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా నాణ్యమైన నెయ్యే వినియోగించే వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - May 15 , 2026 | 04:46 AM