Share News

దర్శనం ఉన్నవారికే శ్రీవారి డాలర్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:57 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం టికెట్‌ ఉన్నవారికే శ్రీవారి బంగారు డాలర్లు విక్రయించాలని, అదికూడా ఒక్క డాలర్‌ మాత్రమే ఇవ్వాలని టీటీడీ యోచిస్తోంది.

దర్శనం ఉన్నవారికే శ్రీవారి డాలర్‌

  • విక్రయాలకు టీటీడీ తాత్కాలిక బ్రేక్‌

  • తక్కువ ధర.. రెట్టింపైన అమ్మకాలపై సమీక్ష

  • బులియన్‌ మార్కెట్‌ ప్రకారం ధరల సవరణకు యోచన

తిరుమల, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం టికెట్‌ ఉన్నవారికే శ్రీవారి బంగారు డాలర్లు విక్రయించాలని, అదికూడా ఒక్క డాలర్‌ మాత్రమే ఇవ్వాలని టీటీడీ యోచిస్తోంది. బంగారం ధర ఏరోజుకారోజు పెరిగిపోతున్నందున బల్క్‌ కొనుగోళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తోంది. తగిన నిర్ణయాలు తీసుకునేదాకా డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బంగారం ధరలు పెరిగిపోతున్న రోజుల్లో శ్రీవారి డాలర్ల ధరలు వారానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్న అంశంపై.. ‘శ్రీవారి డాలర్ల కోసం ఒత్తిళ్లు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు టీటీడీ అధికారులు స్పందించారు. బయటి మార్కెట్‌లో కన్నా టీటీడీ డాలర్‌ ధర తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు పెరగగా, ఆమేరకు టీటీడీకి నష్టం వాటిల్లుతున్న వైనంపై శుక్రవారం సమీక్షించారు. కౌంటర్లలో 2, 5, 10 గ్రాముల డాలర్లు అమ్మకాల రద్దీని బట్టి ఒక్కొక్కరికీ 5,6 వరకు విక్రయించేవారు. ఇకపై కౌంటర్లలో వారానికి ఒకసారి మాత్రమే ధర అమలు చేయడం కాకుండా, బులియన్‌ మార్కెట్‌ ప్రకారం ఏరోజుకారోజు ధరలు సవరించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈమేరకు బయటి మార్కెట్‌లో కన్నా టీటీడీ డాలర్‌ ధర తక్కువగా ఉండడంతో విక్రయాలపై కౌంటర్‌లోని సిబ్బంది ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రూ.50 వేలకు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్‌కార్డ్‌ తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధనను పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్క డాలర్‌ను మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత తాత్కాలికంగా విక్రయాలను నిలిపివేశారు.

రెట్టింపైన అమ్మకాలు

బంగారు, వెండి డాలర్ల విక్రయాలు ఇటీవల భారీగా పెరిగిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. సాధారణ రోజుల్లో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వి లువవైన శ్రీవారి డాలర్ల విక్రయాలు జరుగుతాయి. అయితే 26వ తేదీ నుంచి అమ్మకాలు రూ.కోటికి పైగా జరగడం గమనార్హం. 26న రూ.1.53 కోట్లు, 27న రూ.1.36 కోట్లు, 28న రూ.16.04లక్షలు(ధర మార్పిడి జరిగిన రోజు), 29న రూ.1.17 కోట్లు విలువ చేసే డాలర్ల విక్రయాలు జరిగాయి.

Updated Date - Jan 31 , 2026 | 04:57 AM